పటాన్చెరు/సంగారెడ్డి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రూపాయి లంచం లేకుండా, అప్పు లేకుండా పేదలకు రూ.70 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఉచితంగా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల ప్రమేయం లేకుండా కంప్యూటర్ ద్వారా పూర్తి పారదర్శకంగా అర్హులకు ఇండ్లు అందజేస్తున్నట్టు చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో గురువారం రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల్ల కేటాయింపును మంత్రి హరీశ్‌రావు ప్రారంభించిన అనంతరం సభలో ప్రసంగించారు. ఆసియాలోనే అతి పెద్ద డబుల్ బెడ్రూం గేటెడ్ కమ్యూనిటీ కొల్లూరు టౌన్షిప్ అని హరీశ్ తెలిపారు. ఒకే రోజు 9 నియోజకవర్గాల్లోని 4,600 మంది పేదలకు ఇక్కడ ఇండ్లు ఇండ్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పేదల కోసం ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి కేటాయిస్తున్నదని వివరించారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రతి పేదవాడికి రాబోయే రోజుల్లో ఇల్లు కట్టించి ఇస్తారని స్పష్టం చేశారు. కొల్లూరు టౌన్షిప్లో రేషన్‌షాప్, పీహెచ్సీ, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ వివరించారు. అందుకే ప్రజలు సీఎం కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయాలనుకొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ దొంగ డిక్లరేషన్లను తెలంగాణ ప్రజలు నమ్మబోరని, కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయాలని ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను గణనీయంగా అభివృద్ధి చేశారని, ఆకాశమే హద్దు అన్నట్టు హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెప్పారు. హైదరాబాద్ అమెరికా తరహాలో అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌ను చూస్తే న్యూయార్క్‌లా ఉన్నదని ఇటీవల సినీనటుడు రజనీకాంత్ కితాబిచ్చారని వెల్లడించారు. మద్రాసులో ఉండే రజనీకాంత్‌కు హైదరాబాద్ అభివృద్ధి తెలిసిందని, ఇక్కడ ఉండే కాంగ్రెస్, బీజేపీ గజనీలకు మాత్రం అభివృద్ధి కనిపించటం లేదని విమర్శించారు. ఐటీలో ఉద్యోగాల కల్పన విషయంలో హైదరాబాద్ బెంగళూరును దాటేసిందని వివరించారు. ఐటీ వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలే తమకు హైకమాండ్ అని, ప్రజలకు సేవ చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రజలకోసం పనిచేసే తాము కాంగ్రెస్, బీజేపీ తిట్లు, శాపనార్థాలను దీవెనలుగా భావిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి గురించి ఇరుగు పొరుగు, బంధువులు, మిత్రులకు తెలియజేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను దీవించాలని కోరారు.
మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లను మహిళల పేరిటే కేటాయిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ తదితర పథకాలు అమలు కావటం లేదని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని, 86 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరగటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, సంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీరెడ్డి, ఆర్థిక కమిషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, కలెక్టర్ శరత్, కార్పొరేటర్లు సింధూరెడ్డి, మెట్టుకుమార్ యాదవ్, పుష్ప పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలే మాకు హైకమాండ్. ప్రజలకు సేవ చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యత. ప్రజలకోసం పనిచేసే మేం కాంగ్రెస్, బీజేపీ తిట్లు, శాపనార్థాలను దీవెనలుగా భావిస్తాం.
– మంత్రి హరీశ్‌రావు
మద్రాసులో ఉండే రజనీకాంత్‌కు హైదరాబాద్ అభివృద్ధి తెలిసింది. ఇక్కడ ఉండే కాంగ్రెస్, బీజేపీ గజనీలకు మాత్రం అభివృద్ధి కనిపించటం లేదు. ఐటీలో ఉద్యోగాల కల్పన విషయంలో హైదరాబాద్ బెంగళూరును దాటేసింది. ఐటీ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉన్నది.
– మంత్రి హరీశ్‌రావు
గురువారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో నిర్వహించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో తారసపడిందీ చిత్రం. డబ్బు ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ఎన్నో ప్రభుత్వాలను చూస్తూ వచ్చిందీ పండుటాకు! అంతేనా, తన బతుకును మారుస్తామని చెప్పినవాళ్లందరికీ ఓటు వేస్తూ వచ్చింది. తరాలుగా మారని తన జీవితానికి ఇన్నాళ్లకు.. ఈ ముదిమి వయసులో ఓ గూడంటూ దొరికిందన్న ఆనందంతో ఆమె కండ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుండటం స్పష్టంగా కనిపించింది. జీవితమంతా పేదరికంపై పోరాడడానికే సరిపోయిందని, బక్కచిక్కిన తన ప్రాణం సొంతింటి కల నెరవేరకుండానే కాటికి కాళ్లు చాచిన ఈ తనువుకి ఇది తన ఆస్తి అని చెప్పుకొని గర్వపడేలా దేవుడు కేసీఆర్ రూపంలో కరుణించాడన్నట్టు సుదీర్ఘ ఆలోచనలో పడిందీ అవ్వ. పేదరికం నిండిన ఈ ముఖంలో కృతజ్ఞతాభావం కూడా సుస్పష్టంగా కనిపించింది. గూడు కట్టిచ్చిన అయ్యను గుండెగూటిలో పెట్టుకుంటే సరిపోదని, మరోమారు పట్టం కట్టడం ద్వారా ఆయన రుణం కొంతైనా తీర్చినట్టవుతుందని మనసు పరిపరి విధముల పరితపిస్తుండగా చేతులు జోడిస్తున్న ఈ అవ్వ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం!!
కొత్త ఇల్లు నిర్మిస్తే ఆడపడుచుకు కొత్త బట్టలు పెడతామని, మరి పైసా ఖర్చుకాకుండా రూ.70 లక్షల విలువ చేసే డబుల్బెడ్రూం ఇల్లు ఇస్తున్న సీఎం కేసీఆర్‌కు ఏమిస్తారు? అని మంత్రి హరీశ్‌రావు అడగ్గా, సీఎం కేసీఆర్‌కు ఓట్లు వేసి దీవిస్తామని లబ్ధిదారులంతా ముక్తకంఠంతో బదులు ఇచ్చారు. కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేస్తామని, బీఆర్ఎస్ను గెలిపిస్తామని వెల్లడించారు. హ్యాట్రిక్ సీఎం కౌన్‌బనేగా? కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం పక్కానా? పక్కా అనే వాళ్లు చేతులు ఎత్తాలి అని మంత్రి కోరగా.. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా అని చేతులెత్తి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.
పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ అక్రమంగా సుప్రీంకోర్టులో వేసిన కేసులో తెలంగాణ విజయం సాధించిందని, ఏపీ ఓడిపోయిందని మంత్రి హరీశ్ తెలిపారు. 90 టీఎంసీల కృష్ణా నదీ జలాలు తెలంగాణకు వాటాగా దక్కనున్నట్టు చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. కృష్ణా జలాలను బాజాప్తా ఎత్తిపోసుకుని పాలమూరు రిజర్వాయర్లను నింపుకుంటామని వివరించారు.
మంత్రి హరీశ్‌రావు: నీ పేరు ఏందమ్మా?
లబ్ధిదారు: గాజుల మంగ సారు
మంత్రి: ఎక్కడ ఉంటావు?
లబ్ధిదారు: పటాన్చెరులో ఉంటా సారు
మంత్రి: ఎప్పటినుంచి ఉంటున్నావు?
లబ్ధిదారు: 20 ఏండ్లుగా ఉంటున్నం సారు
మంత్రి: ఇంటి కిరాయి ఎంత?
లబ్ధిదారు: రూ.5 వేలు కిరాయి సారు
మంత్రి: నువ్వేమి పనిజేస్తవమ్మా?
లబ్ధిదారు: కంపెనీలో డ్యూటీ చేస్తా సారు
మంత్రి: నెలకు ఎంత సంపాదిస్తావు?
లబ్ధిదారు: 12వేలు వస్తయి సారు
మంత్రి: ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది కదా. ఖుషీగా ఉన్నదా?
లబ్ధిదారు: శానా ఆనందంగా ఉంది సారు. సీఎం కేసీఆర్ మాకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిండు. సీఎం సారుకు థ్యాంక్స్. మీకు, మా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి థ్యాంక్స్. మాలాంటి గరీబోళ్లకు ఎలాంటి పైరవీలు లేకుండా మంచి ఇల్లు ఇచ్చిండ్రు.
మంత్రి: క్యా నాం హై
లబ్ధిదారు: సమీనా సాబ్
మంత్రి: ఎక్కడ ఉంటారు. ఏమి చేస్తావు?
లబ్ధిదారు: సాబ్ మేం కింగ్‌కోఠిలో ఉంటాం. నేను ప్రైవేట్ ఎంప్లాయి.
మంత్రి: ఇంటి కిరాయి ఎంత కడతారు?
లబ్ధిదారు: సాబ్ రూ.9వేలు ఇంటి కిరాయి కడుతున్నాం.
మంత్రి: ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది కదా? ఏమనిపిస్తున్నది.
లబ్ధిదారు: సాబ్ బహుత్ ధన్యవాద్. ఇప్పుడు రూ.9వేల కిరాయి మిగిలింది మాకు. అల్లా కేసీఆర్ సాబ్‌కు, మీకు, దానం నాగేందర్ సాబ్‌కు మేలు చేస్తాడు. మీ అందరి క్షేమం కోసం అల్లాను ప్రార్థిస్తా. నా జీవితంలో మరువలేని గిఫ్ట్‌ను సీఎం కేసీఆర్ సాబ్ ఇచ్చారు. వారికి రుణపడి ఉంటాం. కేసీఆర్ సాబ్‌కే ఓటు వేస్తాం. మళ్లీ ఆయనే సీఎం అవుతారు సాబ్. మాలాంటి పేదోళ్లకు దేవుడి లెక్క ఇల్లు ఇచ్చిండు.
కూలి పనులు చేసుకుంటూ అద్దె గదిలో భారంగా బతికాం. నెల నెల కిరాయి చెల్లించటం ఇబ్బందిగా ఉండేది. కూలీకి పోతేనే పూట గడిచే దుస్థితి మాది. నా భర్త మరణించటంతో కుటుంబ పోషణ మరింత భారంగా మారింది. పక్కా ఇల్లు వస్తదని దరఖాస్తు చేసుకున్నా. డబుల్ బెడ్రూం ఇల్లు రావటం సంతోషంగా ఉన్నది. పైరవీలు ఏమీ లేకుండా డబుల్ బెడ్రూం ఇచ్చారు. సొంతింటిలోకి అడుగుపెడుతున్నప్పుడు నాకు దుఃఖం ఆగలేదు. నేను అనుభవించిన కష్టాలను సీఎం కేసీఆర్ సార్ దేవుడి రూపంలో తీర్చారు. మళ్లీ మళ్లీ కేసీఆరే సీఎం కావాలి. ఆయన ఉంటే నా లాంటి పేదలకు మేలు జరుగతది. – గోనెల అనిత, గంగపుత్రకాలనీ,
మాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. 16 ఏండ్ల కిందట నగరానికి వచ్చి బాపూనగర్‌లో కిరాయికి ఉంటున్నాం. నా భర్త కారు డ్రైవర్. ఇద్దరు సంతానం. సరైన వసతులు లేని ఇరుకు ఇంట్లో ఇబ్బందిపడ్డాం. మేము తెలంగాణకు చెందిన వారిమి కానప్పటికీ ఎంపిక చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎవరికీ నయాపైసా ఇవ్వకుండానే ఇల్లు సొంతం అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చినంక ఇచ్చిన మాట తప్పలే. పేదలకు వరాలు ఇచ్చే ప్రత్యక్ష దేవుడు కేసీఆర్. ఆయన బాగుండాలని దేవున్ని కోరుకుంటున్న. సొంతింటి కల కలగానే ఉంటుందనుకున్న.. దాన్ని నిజం చేసిన కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– లక్ష్మీమండల్, బాపూనగర్, కుత్బుల్లాపూర్
నియోజకవర్గాలు: పటాన్చెరు, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, బర్కత్‌పుర, నాంపల్లి, రాజేంద్రనగర్, గోషామహాల్, జూబ్లీహిల్స్