హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలను లెకచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. సహాయక చర్యల్లో నిమగ్నమై చే స్తున్న సేవలు అమూల్యమని కొనియాడుతూ శుక్రవారం ట్వీట్ చేశారు.
సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో విపత్తు నిర్వహణ, పోలీసు, మున్సిపల్, పంచాయతీ, ఆరోగ్య సహా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని ప్రశంసించారు. ప్రభుత్వ అత్యవసర సిబ్బంది ప్రజలకు భరోసా కల్పిస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. వానలు తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య, పోలీసు, అగ్నిమాపక, ఆర్అండ్బీ సిబ్బంది సేవలు అందిస్తున్న ఫొటోలను ట్వీట్‌కు జతచేశారు.