Harish Rao | సిద్దిపేట : తొమ్మిదేండ్ల కిందటి తెలంగాణకు ఇవాళ్టి తెలంగాణకు గుణాత్మకమైన మార్పు ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎంతో మంది సీఎంలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల మంచినీటి గోస తీర్చలేదని, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి సీఎం కేసీఆర్ వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తాగునీరు అందించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలో అడుగు పెట్టిన వేళ.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిపితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జీర్ణం అయితలేదని, ఫెయిల్యూర్ అంటూ నోటికొచ్చినట్లుగా పిచ్చిగా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష పార్టీలపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు.
ఇప్పటి దాకా రూ. 6 వేల కోట్లు వరి ధాన్యం డబ్బులు రైతులకు అందించాం అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి పక్షాలు చెప్పే మాటలు నమ్మొద్దు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేవని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
దేశంలోని 13 రాష్ట్రాలలో మహిళా బీడీ కార్మికులు ఉన్నారని, కానీ వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వట్లేదని, కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో బీడీలు చేసే మహిళా కార్మికులకు రూ.2 వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నారని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లాలో 1.18 లక్షల మందికి పింఛన్లు ఉంటే, ఇవాళ 2 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. డబుల్ ఇంజన్ సర్కారు బీజేపీ పాలిత రాష్ట్రాలలో పెన్షన్ రూ. 600 ఇస్తే, తెలంగాణ రాష్ట్రంలో రూ. 2 వేలు ఇస్తున్నామని తెలిపారు.
తెలంగాణ వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చేసుకున్నాం అని మంత్రి తెలిపారు. 70 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగితే 30 శాతం ప్రయివేటులో జరుగుతున్నాయని పేర్కొన్నారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్స్ ప్రారంభిస్తామన్నారు. గర్భిణీలకు 4వ, 7వ నెలలో ఈ న్యూట్రిషన్ కిట్లు అందిస్తాం అని చెప్పారు. గర్భిణీకి రక్త హీనత తగ్గించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.