సంగారెడ్డి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు శుక్రవారం సంగారెడ్డిలో నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి, తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిన ద్రోహం గురించి వివరించారు. నియోకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ క్యాడర్‌ను కోరారు. ఇంకా మాట్లాడుతూ.. ‘గులాబీల జెండలే రామక్క’ అని ఓ మహిళ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల గురించి బతుకమ్మ పాట రూపంలో చక్కగా వివరించిందని మెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఈ ఒక్క పాట చాలు అని అన్నారు. ఆ పాటను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు.
‘జగ్గారెడ్డి నాడు తెలంగాణ రానే రాదని అంటే.. కేసీఆర్ చావు నోట్లె తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ వచ్చినంక ప్రజల మేలు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైతే ఆసరా పెన్షన్ రూ.5 వేలకు పెరుగుతది. రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇయ్యాలని కేసీఆర్ నిర్ణయించిండు. బీజేపోళ్లు రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1000కి పెంచిండ్రు. ఎన్నికల తర్వాత రాష్ట్రం ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తది. ఒకప్పుడు మహిళలు నీళ్లు మోసీమోసీ అవస్థలు పడ్డరు. ఇప్పుడు ఆ అవస్థలు లేవు. ఎన్నికలైనంక అర్హురాలైన ప్రతి మహిళకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకు రూ.3000 భృతి ఇవ్వబోతున్నం’ అని మంత్రి చెప్పారు.
‘ఇన్నాళ్లు రైతులకు మాత్రమే పరిమితమైన రైతు బీమా పథకాన్ని ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కోటి మందికి వర్తింప జేయబోతున్నాం. గత ప్రభుత్వాలు రైతుల నుంచి రకరకాల శిస్తులు వసూలు చేశాయి. కానీ కేసీఆర్ ఆ శిస్తులన్నీ రద్దుచేసి ఉల్టా రైతుబంధు కూడా ఇస్తున్నడు. ఈ ఎన్నికల తర్వాత రైతుబంధును రూ.16 వేల దాకా పెంచనున్నం. ఇవన్నీ ప్రజలకు వివరించి చెప్పండి. అప్పుడు వాళ్లకు భరోసా వస్తది. కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటేస్తే ‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు అయ్యింది’ కూడా ప్రజలకు వివరించండి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ రాష్ట్రంలో 5 గంటల కరెంటిస్తున్నమని గొప్పలు చెప్పిండు. ఇక్కడ 24 గంటల కరెంటు ఇస్తుంటే 5 గంటల కరెంటు ఏం గొప్పో ఆయనకే తెలువాలి’ అని మంత్రి ఎద్దేవా చేశారు.
‘కార్యకర్తలారా మీరంతా కష్టపడి పనిచేయండి. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయండి. మీ అందరి క్షేమం నేను చూసుకుంటా. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో మిమ్మల్ని దగ్గరుండి నేను గెలిపించుకుంటా. చింతా ప్రభాకర్‌ను గెలిపిస్తే ఆరు నెలల్లోపే సంగారెడ్డిలో 10 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తా. ఈ విషయాన్ని కూడా ప్రజల మధ్యకు గట్టిగా తీసుకెళ్లండి. చింతా ప్రభాకరన్న ప్రజల కోసం పడుతున్న తపనను కూడా ఓటర్లకు వివరించి చెప్పండి. మీ కృషితో సంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ మామూలుగా కాదు.. 50 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలువబోతున్నది’ అని మంత్రి హరీష్‌రావు చెప్పారు.