హైదరాబాద్ : డెంగీ జ్వరానికి ఆరోగ్య శ్రీలో చికిత్స అందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దీనిపై ప్రయివేటు ఆస్పత్రులకు కూడా ఆదేశాలు ఇస్తామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ ఈగలు, దోమల బెడదపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు.
2018-19తో పోలిస్తే ఇప్పుడు డెంగీ తీవ్రత తక్కువగానే ఉందన్నారు. 2020లో కరోనా కారణంగా అందరూ ఇండ్లకే పరిమితం కావడం వల్ల డెంగీ కేసులు ఎక్కువగా నమోదు కాలేదు. 2018లో 6,362, 2019లో 13,361 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4694 కేసులు వచ్చాయన్నారు. నగరంలో దోమల బెడదను అదుపు చేసేందుకు జీహెచ్ఎంసీతో కలిసి సంయుక్తంగా చర్యలు చేపడుతామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా తాత్కాలికంగానైనా నియామకాలు చేపట్టాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు.