మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ, న్యూట్రిషన్ కిట్స్, వడ్డీ లేని రుణాల కింద రూ.750 కోట్లు సీఎం కేసీఆర్ కానుకగా ఇచ్చారు. మహిళా సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశంలోనే టాప్‌లో నిలిపారు. మహిళలు ప్రేమగల వారు. సద్ది తిన్న రేవును తలుస్తారు. ఈ ప్రభుత్వంపై మహిళల ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి.
– హరీశ్
కరీంనగర్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): తల్లి బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, అందుకే సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రవేశపెట్టారని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. బుధవారం ఆయన కరీంనగర్ బుట్టిరాజారాం కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్లో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం రాంనగర్‌లోని మార్క్‌ఫెడ్ గ్రౌండ్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పలువురు మహిళా అధికారులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మహిళలకు ఆరోగ్య మహిళ, న్యూట్రిషన్ కిట్స్, వడ్డీ లేని రుణాల కింద రూ.750 కోట్లు కానుకగా ఇచ్చారని తెలిపారు. ఆరోగ్య మహిళ పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో వంద ప్రభుత్వ దవాఖానాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, భవిష్యత్తులో మరో 1,200 ప్రత్యేక దవాఖానలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. మహిళా దవాఖానలు ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే పనిచేస్తాయని, ఇందులో అటెండర్ నుంచి వైద్యుల వరకు అందరూ మహిళలే సేవలు అందిస్తారని వివరించారు.
శ్రీరామనవమి తర్వాత న్యూట్రిషన్ కిట్
జననం నుంచి మరణం వరకు వర్తించే విధంగా సీఎం కేసీఆర్ అనేక వినూత్న పథకాలను ప్రారంభించారని, మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం సూపర్‌హిట్ అయిందని, శ్రీరామనవమి తర్వాత న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు ఈ కిట్ ద్వారా బలవర్ధకమైన ఆహారం అందించి ఆరోగ్యవంతమైన బిడ్డలు జన్మించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా బలహీనమైన బిడ్డలు జన్మించడంతోపాటు మాతా, శిశు మరణాలు సంభవిస్తుండటంతో వాటిని నివారించేందుకు న్యూట్రిషన్ కిట్స్‌ను ప్రవేశ పెడుతున్నామని చెప్పారు.
ఇలా తాము న్యూట్రిషన్ పాలిటిక్స్ తెస్తుంటే.. బీజేపీ కులం, మతం పేరిట సమాజాన్ని విడదీస్తూ పార్టిషన్ పాలిటిక్స్ చేస్తున్నదని విమర్శించారు. ఎవరిది మంచో, ఎవరిది చెడో గ్రహించాలని కోరారు. ఈ రెండు పథకాలతోపాటు మహిళలకు 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ లేని రుణాలు రూ.750 కోట్లు సీఎం కేసీఆర్ విడుదల చేశారని, అవి ఇప్పుడు మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. మిగతావి వచ్చే జూన్, జూలైలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
పనులు పెరిగి మహిళా కూలీలు దొరకని పరిస్థితిలో కొన్ని గ్రామాల్లో పురుషులు నాట్లు వేస్తున్నారని, రాష్ట్రంలో ఇప్పుడు భూమికి బరువయ్యేంత పంట పండుతున్నదని చెప్పారు. నీళ్లు ఫుల్లు, కరెంట్ ఫుల్లు, చేపలు ఫుల్లు, పంట ఫుల్లు, మొత్తంగా రాష్ట్రం పవర్‌ఫుల్లుగా మారిందని స్పష్టం చేశారు. ‘మహిళలు ప్రేమగల వారు. సద్ది తిన్న రేవు తలుస్తారు. సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక పథకాలు తెచ్చి రాష్ర్టాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు. ఈ ప్రభుత్వంపై మహిళల ఆశీర్వాదం ఉండాలి’ అని హరీశ్‌రావు కోరారు.
ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం చూడాలని: మంత్రి గంగుల కమలాకర్
ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళ పథకాన్ని తెచ్చారని బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎక్కడ స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని సీఎం కేసీఆర్ నమ్ముతారని చెప్పారు. ఆడ బిడ్డలను సీఎం కేసీఆర్ సంతోష పెడుతుంటే.. ప్రధాని మోదీ మహిళలను ఏడిపిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కార్పొరేషన్ల చైర్మన్లు సర్దార్ రవీందర్‌సింగ్, బండ శ్రీనివాస్, మేయర్ వై సునీల్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
8 రకాల పరీక్షలు ఉచితం
ఆరోగ్య మహిళ దవాఖానాల్లో క్యాన్సర్, రక్తహీనత, గర్భసంచి, అధిక బరువు, పోషకాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి 8 రకాల పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్వహించి, మందులు కూడా ఇస్తారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. 80% వ్యాధులకు మహిళా దవాఖానల్లోనే పరిష్కారం లభిస్తుందని, ఇక్కడ నయం కాని పక్షంలో జిల్లా కేంద్రాల్లోని ప్రధాన దవాఖానలకు రెఫర్ చేస్తారని, అక్కడ ప్రత్యేకమైన హెల్ప్‌డెస్క్‌లు, ఒక్కో విభాగానికి ఒక్కో కియో వార్డులు ఉంటాయని వివరించారు. జిల్లా దవాఖానల్లో అవసరమైన ఆపరేషన్లు చేయడంతోపాటు మందులు ఉచితంగా ఇస్తారని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని భరోసా ఇచ్చారు.