Minister Harish rao | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు తడారిన నేలలతో ఇబ్బంది పడిన తెలంగాణ.. నేడు గోదారి పరవళ్లతో ‘జల తెలంగాణ’గా మారిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలోనే జలవిజయం సాధించిందని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు నాటి, నేటి పరిస్థితులను కండ్లకు కట్టినట్టు వివరించారు. ‘నాడు ఎటు చూసినా తడారిన నేలలు.. నేడు ఎటు చూసినా పరవళ్లు తొకుతున్న గోదారి. నాడు ఎటుచూసినా నోళ్లు తెరిచిన బీళ్లు.. నేడు తలలూపుతున్న ఆకుపచ్చని పైర్లు. ఇది తెలంగాణ జలవిజయం.. కేసీఆర్ సాధించిన ఘన విజయం. మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు.. ఊటలు జాలువారుతున్న వాగులు.. పాతాళగంగమ్మ పైపైకి ఎగదన్నుతున్న జలదృశ్యాలు. ఇది కదా జల తెలంగాణ.. ఇది కదా కోటి రతనాల మాగాణ’ అని ట్వీట్ చేశారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.