గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 03:00:00

కరోనాకు భయపడొద్దు అలాగని నిర్లక్ష్యం పనికిరాదు : మంత్రి తన్నీరు హరీశ్‌రావు

కరోనాకు భయపడొద్దు అలాగని నిర్లక్ష్యం పనికిరాదు : మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట కలెక్టరేట్‌: కరోనాకు భయపడొద్దని.. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రజలకు సూచించారు. రోజూ వేడి నీళ్లు, కషాయం తాగాలన్నారు. కరోనా పాజిటివ్‌ ఉన్న వారిని వెలివేయడం, చిన్నచూపు చూడడం సరైంది కాదన్నారు. శనివారం సిద్దిపేటలోని ముస్తాబాద్‌ చౌరస్తాలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత కషాయ కేంద్రాన్ని ప్రారంభించారు. సిద్దిపేటలో హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న వారికి కోవిడ్‌-19 కిట్స్‌ను పంపిణీ చేశారు. వైద్య కళాశాల దవాఖాన సిబ్బందికి 400 ఫేస్‌ షీల్డ్‌ కిట్స్‌ను అందజేశారు. పట్టణంలోని నూతన పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ భవనం, ఎన్జీవో కాలనీలో కమ్యూనిటీ హాలును, ఆర్‌ఎంపీ, పీఎంపీ భవనాలను ప్రారంభించారు. ఆయా సమావేశాల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో నాలుగు చోట్ల కషాయం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా బారిన పడిన వారికి 12 రకాల వస్తువులతో కిట్స్‌ అందిస్తున్నామని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి చికిత్స చేయడం కోసం ప్రత్యేకంగా సిద్దిపేటలో వంద పడకల దవాఖాన, గజ్వేల్‌ ఆర్వీఎంలో వంద పడకలు, సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌ దవాఖానలో వంద పడకలు ఏర్పాటు చేశామన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.logo