Minister Harish Rao | హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మూడొంతుల మెజార్టీతో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు స్థిరమైన, ప్రూవెన్ గవర్నమెంట్‌ను కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని తెలిపారు.
తెలంగాణ జాతి గౌరవాన్ని పెంచిన నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పార్టీ పెట్టడమే కాకుండా ప్రత్యేక రాష్ట్రం లక్ష్యాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. సోమవారం ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రం పక్షపాత వైఖరి వల్ల రాష్ర్టానికి రూ.లక్ష కోట్లు రాకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి మోటర్లకు మీటర్లు పెట్టి ఉంటే రూ.35 వేల కోట్ల నిధులు వచ్చేవని చెప్పారు.
ఎఫ్ఆర్బీఎం ద్వారా రూ.34 వేల కోట్లు నష్టపోయామని తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వలేదని, నీతి ఆయోగ్ నిధులు కూడా రాలేదని వివరించారు. కేంద్రం ఎంత వివక్ష ప్రదర్శించినా సంక్షేమ పథకాలేవీ ఆగలేదని గుర్తుచేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే స్వప్నం నెరవేరిందని పేర్కొన్నారు. స్థానికులకే ఉద్యోగాలు వచ్చేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించేందుకు కృషిచేశామని వెల్లడించారు. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిందని చెప్పారు.
ఉత్తమ పారిశ్రామిక విధానం ద్వారా ద్వారా పెట్టుబడులు సాధించి 24 లక్షల ఉద్యోగాలు కల్పించామని, ఐటీ ఉద్యోగాల్లో బెంగళూర్‌ను హైదరాబాద్ అధిగమించిందని వివరించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దోషులను శిక్షించామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఏటా ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలుచేసిన పార్టీ బీఆర్ఎస్ అయితే, హామీలను అమలుచేయని చరిత్ర కాంగ్రెస్‌ది అని వివరించారు. దళితబంధు, రైతుబంధు, కేసీఆర్ కిట్టు, మిషన్ భగీరథ తదితర పథకాలు ఎన్నికల హామీలు కాదని తెలిపారు.
నేను, కేటీఆర్ మంచి స్నేహితులం. మా మధ్య ఏదో ఉన్నదని ప్రచారం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. మేమిద్దరం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం. పార్టీ బాగుండాలని, ప్రభుత్వం ఉత్తమ పాలన అదించాలని తపిస్తాం. మా ఇద్దరికీ సీఎం కేసీఆర్ చెప్పిందే భగవద్గీత. ఆయన ఏం చెప్పినా ఆచరిస్తాం. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది కేసీఆర్ నిర్ణయం. ఆయన ఎవరిని నియమించినా అంగీకరిస్తాను.
– మంత్రి హరీశ్‌రావు
కర్ణాటక మాడల్ అంటూ భంగపడ్డ కాంగ్రెస్
కర్ణాటక మాడల్ ప్రవేశపెడతామన్న కాంగ్రెస్ నేతలు.. అక్కడ 5 గంటల విద్యుత్తు ఇస్తున్న విషయం బయటపడగానే కర్ణాటకకు, తమకూ సంబంధం లేదని చెప్తున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. దళితబంధు పథకాన్ని అర్హులైనవారందరికీ దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. దళితులకు మూడు ఎకరాల పంపిణీకి అవసరమైన భూసేకరణ సాధ్యం కావడంలేదనే ఉద్దేశంతోనే దళితబంధు ద్వారా రూ.పది లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు వంటి పథకాలు పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పారు. కలెక్టర్లకే బాధ్యత అప్పగించామని, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి రేవంత్‌రెడ్డికి కోదండరాం మద్దతు ఇస్తున్నారని, తెలంగాణను వ్యతిరేకించిన షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు.
నా జీవితంలో ఈరోజు పది మందికి ఉపయోగపడాలనుకుని ఇంటి నుంచి బయలుదేరుతాను. అలా జరుగని రోజు రాత్రి సరిగా నిద్రపోలేను. నేను ఏనాడూ కుర్చీలు, పదవులు కోరుకోలేదు. పదవి కన్నా క్యారెక్టర్ ముఖ్యమని భావిస్తాను. పదవులు వస్తాయి. పోతాయి. క్యారెక్టర్ శాశ్వతం. ఒక్కసారి పోతే రాదు.
– మంత్రి హరీశ్‌రావు
ప్రాజెక్టులపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ, ప్రాణహితకు అనుమతులు తేలేకపోయిందని హరీశ్‌రావు విమర్శించారు. చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. వ్యవసాయంపై కనీస అవగాహన లేకుండా రేవంత్ మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్తున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ ఇంకా రూ.4,500 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నదని, చివరి రైతు వరకూ అమలుచేస్తామని చెప్పారు. 97% రైతులు సన్న, చిన్నకారు రైతులేనని, రైతుబంధు పథకాన్ని వారికే ఇచ్చే అంశంపై ఆలోచిస్తామని వెల్లడించారు. మొదటి విడతలో వ్యవసాయం, విద్యుత్తు తదితర రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తే, రెండోదశలో విద్య, వైద్యంపై ఫోకస్ పెట్టినట్టు తెలిపారు.
బీఆర్ఎస్ రిజక్ట్ చేసిన క్యాండిడేట్లతో ప్రతిపక్ష పార్టీలు గోడౌన్లు నింపుకున్నాయి. గెలిచే అవకాశాలు ఉంటే మేమే టికెట్లు ఇచ్చేవాళ్లం.ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేరు కాబట్టే, వారికి టికెట్లు ఇస్తున్నారు.
– మంత్రి హరీశ్‌రావు
కాళేశ్వరంపై బురదజల్లే ప్రయత్నం
కాళేశ్వరంపై కాంగ్రెస్ ఆరోపణలు అవగాహనా రాహిత్యం అని, గోబెల్స్ ప్రచారం చేస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నేడు రెండు పంటలు పండుతున్నాయని, వేసవిలో కూడా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని చెప్పారు. అవినీతి ఆరోపణల ద్వారా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లర్లను రిస్టోర్ చేయాల్సి వస్తే చేసి, వచ్చే యాసంగి సీజన్లో యథావిథిగా నీళ్లు ఇస్తామని చెప్పారు.
ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐదు రోజుల్లో నివేదిక ఇచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు శిలాఫలకాలు వేస్తూ, మొ క్కలు నాటుతూ డ్రామాలు చేశాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశామని, ఎస్ఎల్బీసీ పథకం కూడా రానున్న ఎనిమిది, తొమ్మిది నెలల్లో అది కూడా పూర్తవుతుందని చెప్పారు.
బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య ఎలాంటి ఒప్పందం లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. బీజేపీ గురించి రోజూ మాట్లాడుతూనే ఉన్నాం. కేసీఆర్ సెక్యులర్ లీడర్. కలుషితమైన రాజకీయాలు ఒప్పుకోం. బీజేపీతో కలిసి పనిచేసే ఆలోచన లేదు
– మంత్రి హరీశ్‌రావు
మనుషులు కాదు.. పశువులు
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై జరిగిన దాడులను సానుభూతి కోసం బీఆర్ఎస్సే చేసిందని ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు ‘ఇంత చిల్లరగాళ్లు రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరం. సానుభూతి కోసం ఎవరైనా కత్తితో పొడుచుకుంటారా?’ అని వ్యాఖ్యానించారు. ఆయన పేగును తొలిగించామని, తీవ్ర రక్తస్రావం అయ్యిందని డాక్టర్లు నివేదిక ఇచ్చినా విమర్శించేవాళ్లను మనుషులు అనరు, పశువులు అంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గువ్వల బాలరాజు మీద కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ స్వయంగా రాళ్లు వేస్తున్న వీడియో చూశామని, బీఆరెస్సే దాడి చేస్తే ఆయన అక్కడెందుకు ఉన్నారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్కు కేసీఆర్ లాంటి మంచి నాయకుడు ఉన్నారు. సీఎంగా కేసీఆర్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌లో సీఎం సీటు కోసం మారణహోమం జరిగిన అనుభవాలున్నాయి. ఎవరికి వారే సీఎం అంటే.. అధిష్ఠానం మెప్పు కోసం, ఎమ్మెల్యేల మద్దతు కోసమే కాలం సరిపోతుంది. కాంగ్రెస్ పరిపాలన చేయలేదు. సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ లీడర్. సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడే వ్యక్తి నాయకుడిగా రాణించలేడు.
– మంత్రి హరీశ్‌రావు
అన్ని నియోజకవర్గాలపై సమదృష్టి
రాష్ట్రంలోని అన్ని నియోజవర్గాలను సీఎం కేసీఆర్ సమానంగా అభివృద్ధి చేశారని హరీశ్‌రావు చెప్పారు. చంద్రబాబు అరెస్టును తనతోపాటు అనేకమంది ఖండించారని తెలిపారు. ప్రజలకు, రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది పెట్టకుండా నిరసనలు చేస్తే ప్రభుత్వానికి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. మొదటి విడత ప్రభుత్వ హయాంలో గద్దర్‌ను తానే సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లానని చెప్పారు. గద్దర్ తన సొంతూరుకు చెక్‌డ్యాం, లిఫ్ట్ ఇరిగేషన్ అడిగితే సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, అప్పుడు ఆయన మెచ్చుకున్నారని వెల్లడించారు.
మైనార్టీల అభివృద్ధికి ప్రాధాన్యం
50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీలు, దళితులకు ఏమి చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రూ.300 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే, కేసీఆర్ రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టారని వివరించారు. మైనార్టీలకు దేశంలోని మిగతా రాష్ర్టాల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారని తెలిపారు. చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో మైనార్టీలకు అవకాశాలు కల్పించామని వివరించారు.
ఎస్సీ వర్గీకరణపై మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేసి, కేంద్రానికి పంపాం. సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ప్రధానమంత్రిని కలిసి లేఖ ఇచ్చారు. ఎన్నికల కోసం బీజేపీ నాటకాలు ఆడుతున్నది. ఎస్సీ వర్గీకరణపై కమిటీలు అవసరం లేదు. బిల్లు పెట్టాల్సిన అవసరం ఉన్నది.
– మంత్రి హరీశ్‌రావు
24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నాం
పదేండ్ల కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు ఉత్త కరెంటుగా మారిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. నాటి పదేండ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు సరఫరా, బీఆర్ఎస్ పాలనలో కరెంటు సరఫరాపై ప్రజలను రెఫరెండం కోరి.. ఓటు అడుగుదామని సవాల్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 90% 24 గంటల కరెంటు సరఫరా అవుతున్నదని, ఒక్క గుంట పంట కూడా పంట ఎండిపోకుండా కరెంటు సరఫరా అవుతున్నదని చెప్పారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు లేక 250 మంది రైతులు ఆత్మహత్మ చేసుకున్నారని, విద్యుత్తు చార్జీలు పెంచారని, రైతుబంధు బంద్ చేశారని విమర్శించారు.
కుటుంబ పాలనపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు
కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. తాము ఉద్యమంలో పాల్గొన్నామని, 200 కేసులు ఎదుర్కొన్నామని వివరించారు. పరోక్షంగా రాజకీయాల్లోకి రాలేదని, లక్ష ఓట్ల మెజార్టీతో ప్రజాక్షేత్రంలో గెలిచామని చెప్పారు. ఎమ్మెల్సీ కవితపై కేసు కోర్టు స్టే వల్ల ఆగిపోందని తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడే బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఉండాలని పేర్కొన్నారు. ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పారు. జర్నలిస్టులకు అన్ని జిల్లాల్లో ఇండ్ల స్థలాలు ఇప్పించామని, మళ్లీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.