హుజూరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న బండికి హరీశ్ హెచ్చరిక చేశారు. ఈ పథకాన్ని అడ్డుకుంటే దళితుల ఉసురు తగిలి.. ఆ కుట్రల్లో మాడి మాసై పోతారని హెచ్చరించారు.
హుజూరాబాద్ సిటీ సెంటర్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్నప్పటికీ దళితులు వివక్షకు గురవుతున్నారు. పేదరికాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే దళితులను బాగు చేసేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తామంటే.. బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఆరునూరైనా సరే అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి దళిత బంధు అందించి తీరుతాం.
దళితులపై నిజంగా ప్రేమ ఉంటే.. ఈ పథకాన్ని ఎందుకు ఆహ్వానించలేదు అని ప్రశ్నించారు. ఈ పథకాన్ని ఆపాలని హైకోర్టులో కేసులు వేశారు. ఈసీకీ లేఖలు రాస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టి రోడ్ల మీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దళిత బంధును నూటికి నూరు శాతం ఇవ్వాలని కేబినెట్లో ఆమోదించాం. హుజూరాబాద్ దళిత బిడ్డలు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అత్యంత పారదర్శకమైన పద్దతుల్లో ఈ పథకం అమలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.