Minister Harish Rao | ప్రధాని మోదీ ఎప్పుడు అవకాశం చిక్కినా తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో సంబురాలు చేసుకోలేదని అంటున్నారని.. ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదన్నారు. తెలంగాణ ఊరు, వాడా సంబురం చేసుకుందని.. రాష్ట్ర ఏర్పాటు కావడంతోనే దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం నంబర్ వన్‌గా ఉందని హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్‌లో డబుల్ లైన్ రోడ్‌తో పాటు పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేయడంతో పాటు గ్రంథాలయం ప్రారంభించారు.
అనంతరం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే తెలంగాణలోని ప్రతి ఒక్కరూ సంతోషపడ్డారని, పండుగ చేసుకున్నారన్నారు. కానీ, మోదీ మాత్రం పండగ చేసుకోలేదని కడుపులో విషం కక్కుతున్నారని ఆరోపించారు. వేరుపడ్డ తొలి రోజుల్లోనే 7 మండలాలు ఏపీలో కలిపి తెలంగాణకు అన్యాయం చేశారని, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఆంధ్రాకు అప్పజెప్పి మోదీ తెలంగాణకు మోసం చేశారన్నారు. జాతీయ ప్రాజెక్టు, గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా? అంటూ నిలదీశారు.
ఏటా రూ.2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2లక్షల కూడా ఇవ్వలేదన్నారు. అలాంటివారు తెలంగాణపై విషం చిమ్మడం మానాలని హితవు పలికారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో సంబరం చేసుకోలేదు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నారాయణ్ ఖేడ్ అంటే ఒకప్పుడు కొట్లాటలు, గంజాయి సాగు, అభివృద్ధికి ఆమడ దూరం ఉండేదన్నారు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల ఘనతేనన్నారు. తల్లిదండ్రులు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తే పిల్లల చదువు ఆగేదని, అభివృద్ధికి అడ్డాగా నేడు నారాయణ్ ఖేడ్ మారిందన్నారు.
చెరువులు, చెక్ డ్యాంలు, మార్కెట్ యార్డులు, పచ్చని పంటలు మక్కలు, శెనగలు నాడు కొనని పరిస్థితులుండేవని, నేడు అన్ని పంటలు కొంటున్నామన్నారు. అందుకే కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్.. అక్కడున్నది కాంగ్రెస్ అన్నారు. నాడు నీళ్ల కోసం అనేక కష్టాలు పడ్డామని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. నల్లాలు పెట్టి ఇంటింటికీ నీళ్లు ఇచ్చింది కేసీఆరేనన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలంటూ మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో పింఛన్లు రూ.600, దివ్యాంగులకు రూ.1000 ఇస్తున్నారని.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఇస్తుందో ప్రజలు ఆలోచించాలన్నారు.
కర్నాటకలో పది కిలోల బియ్యం ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు అన్నారని, ఉన్న బస్‌ను బంద్ పెట్టారన్నారు. ఉచిత కరెంటు అని చెప్పి.. కరెంట్ బిల్లును డబుల్ చేశారన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో చెప్పేవి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్నాటకలో దవాఖానలు బాగోలేవని ప్రజలు ఇక్కడికి వస్తున్నారని, అధికారంలోకి వస్తే ఆరునెలకోసారి సీఎం మారుతారని.. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పోతారన్నారు. వాళ్ల హైకమాండ్ ఢిల్లీ అని.. మన హైకమాండ్ గల్లీలో ఉండే ప్రజలేనన్నారు.