మెదక్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఎస్సెస్సీ హిందీ ప్రశ్నపత్రం కాపీయింగ్ వ్యవహారంలో పట్టపగలు అడ్డంగా దొరికిన దొంగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణపై బీజేపీ కుట్రలు మరోమారు బయటపడ్డాయని, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ దివాలాకోరు రాజకీయాలను చేస్తున్నదని మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నపత్రాలు బయటకు వచ్చిన ఉదంతంలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారుగా తేలిందని పేర్కొన్న హరీశ్‌రావు.. పలు అంశాలపై బండిని నిలదీశారు.
‘నిందితుడు ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాదా? ఆయన నీతో ఫోన్లో మాట్లాడలేదా? 2 గంటల్లో 142సార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. తప్పుడు పనులు చేయడంతోపాటు ప్రజల్ని తప్పుదోవ పట్టించినందుకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అన్నారు. తెలంగాణలో బీజేపీ క్షుద్రరాజకీయాలను అర్థం చేసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులను కోరిన మంత్రి.. బండి సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు.
కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక..
బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రికేసీఆర్ను ఎదుర్కొలేక బీజేపీ దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నదని, పలుమార్లు తెలంగాణపై ఆ పార్టీ కుట్రలు నగ్నంగా బయటపడ్డాయని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, టీఎస్పీఎస్సీ లీకేజీలో, ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ కుట్రలు రెడ్‌హ్యాండెడ్‌గా బయటపడ్డాయని తెలిపారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎస్సెస్సీ ప్రశ్నపత్రం బయటకు వచ్చిన కేసులో పట్టపగలు అడ్డంగా ఆధారాలతో సహా దొరికిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమర్థించడం సిగ్గుచేటన్నారు.
పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి రాజకీయాలు చేయడం అవసరమా? అని హరీశ్ ప్రశ్నించారు. రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయవద్దని బీజేపీ నేతలకు హితవు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోలాగా గూండాగిరీని తెలంగాణలో ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబోమని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తే యువత బీజేపీకి దూరమవుతుందని బండి సంజయ్ బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు.
పథకం ప్రకారమే లీకేజీలు..
బీజేపీ నాయకులు పేపర్ లీకేజీలకు పాల్పడుతూ.. వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ బీఆర్ఎస్పై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ అంటేనే విచ్ఛిన్నం, విద్వేషం, కుట్ర అని.. రాజకీయం కోసం, అధికారం కోసం ఆ పార్టీ నాయకులు ఎంతకైనా తెగిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మొన్న తాండూరులో పేపర్ లీకేజీకి పాల్పడిన టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారు. నిన్న వరంగల్‌లో జరిగిన పేపర్ లీకేజీ వెనుక బండి సంజయ్ ఉన్నాడు. నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీలో కరుడుగట్టిన కార్యకర్త. బండి సంజయ్‌కి ముఖ్య అనుచరుడు.
ఆయనకు పలువురు బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి’ అని హరీశ్‌రావు తెలిపారు. బీజేపీలో చదువుకున్నోళ్లు తక్కువగా ఉన్నారని, బీజేపీ నేతలకు చదువు విలువ తెలియదని విమర్శించారు. అందుకే రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ఆ పార్టీ నేతలకు ఫేక్ సర్టిఫికెట్లే ఉన్నాయని చెప్పారు. పదోతరగతి విద్యార్థులతో బీజేపీ క్షుద్ర రాజకీయం చేస్తున్నదని.. దాని కుట్ర ధోరణి వల్లే కేసీఆర్ ఆ పార్టీని ‘థూ మీ బతుకు చెడ’ అంటూ తిట్టా ల్సి వచ్చిందని గుర్తుచేశారు. బీజేపీ కుట్రలో చిక్కుకోవద్దని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. తెలంగాణను ఆగం చేసేందుకు బీజేపీ చేస్తున్న విషప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. పిల్లలు చదువుపై దృష్టిపెట్టాలని, ఈ విషయంలో తల్లిదండ్రులు జాగరూకతతో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ కుట్రలను ఛేదించి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. కేసీఆర్ ముందు బండి సంజయ్ పప్పులు ఉడకవని చెప్పారు.
బండికి హరీశ్‌రావు సూటి ప్రశ్నలు