Minister Harish Rao | సిద్దిపేట, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గజ్వేల్: సొమ్ము ఒకరిది.. సోకొకరిది అన్నట్టుగా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, రైల్వే లైన్‌ను తామే సాధించామని గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మంగళవారం సిద్దిపేట రైల్వేస్టేషన్లో రైలును ప్రారంభించిన హరీశ్‌రావు.. దుద్దెడ వరకు ప్రయాణించారు. అనంతరం కొండపాకలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఆ తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో రూ.530 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సమైక్య పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్‌ను అటకెక్కించిందని మండిపడ్డారు.
ఇప్పుడు బీజేపీ పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఆగ్రహించారు. రూ.640 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించి ఈ ప్రాజెక్టును సాధిస్తే, ఈరోజు రైలు ప్రారంభోత్సవంలో కనీసం సీఎం కేసీఆర్ ఫొటో పెట్టకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి సోమవారం రాత్రి కేవలం ఫోన్ చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా చెప్పి అవమానించారని వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు రైలు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేశారని వివరించారు. తాను సైతం అనేక సార్లు రైలు పట్టాల వెంబడి నడుచుకుంటూ వెళ్లి స్వయంగా పనులను పరిశీలించానని, భూసేకరణ కోసం ఎదురైన ఇబ్బందులను తానే స్వయంగా ముందుండి పరిషరించానని గుర్తుచేశారు. రైల్వే లైన్ నిర్మాణానికి కావాల్సిన భూమి కోసం ఎంతోమంది రైతులను బతిమాలి ఒప్పించామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏనాడైనా రైల్వే లైన్ నిర్మాణ పనులను కనీసం పరిశీలించారా? అని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రిగా రైల్వేలైన్ మంజూరు చేయించిన కేసీఆర్
2006లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ అప్పట్లోనే సిద్దిపేట రైల్వే లైన్ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మంజూరు చేయించారని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. రైల్వేలైన్ ఏర్పాటుకు అయ్యే మొత్తం బడ్జెట్లో 33 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, భూసేకరణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చేసి ఇవ్వాలని, నష్టాల్లో 5 శాతం వాటాను భరించాలని కేంద్రం షరతులు విధించిందని గుర్తుచేశారు. అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ షరతులకు ఒప్పుకోకపోవడంతో ఈ రైల్వే ప్రాజెక్టు మరుగున పడిందని తెలిపారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సిద్దిపేటకు రైలు రావాలన్న కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ చెప్పిన షరతులు అన్నింటికీ అంగీకరించారని గుర్తుచేశారు.
సిద్దిపేట లైన్‌తోపాటు అకన్నపేట- మెదక్ రైల్వేలైన్ సైతం సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితోనే సాధించారని చెప్పారు. సిద్దిపేట రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,508 ఎకరాల భూమిని సేకరించిందని వెల్లడించారు. భూసేకరణ కోసం రూ.310 కోట్లను రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. విద్యుత్తు స్తంభాలు, మిషన్ భగీరథ పైపులు, ఇతర ఆస్తుల నష్టాన్ని సైతం లెకచేయకుండా అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. రైల్వే లైన్ నిర్మాణం కోసం రైల్వే శాఖకు రూ.330 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.640 కోట్లు ఖర్చు చేసి సిద్దిపేట రైల్వే లైన్‌ను సాధించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తే బీజేపీ క్రెడిట్ పొందేందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు.
ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే
సంక్రాంతికి ముందు వచ్చే పందెం కోళ్లలాగా ఐదేండ్లకోసారి వచ్చే కాంగ్రెస్ నాయకులను నమ్మి ఎవరూ మోసపోవద్దని, కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొని విసిగిపోయారని, తప్పిపోయి ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మళ్లీ కష్టాలు తప్పవని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. పీసీసీ అంటే పేమెంట్ కలెక్షన్ సెంటర్ అని, దరఖాస్తు చేసుకోవాలన్నా, టికెట్లు కావాలన్నా డబ్బులు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారని తెలిపారు. మోసం, కలెక్షన్‌తో కాంగ్రెస్ పెద్దలు బిజీబిజీగా ఉన్నారని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ అనుకోకుండా వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన కొత్త భవనాలకు సున్నం, వేసిన రోడ్లకు డాంబర్ కూడా వేయలేని పరిస్థితిని చూస్తామని హెచ్చరించారు.
మూడు గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలా? మూడు పంటలు పండించుకునేలా బ్రతుకులు మారుస్తున్న కేసీఆర్ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ హయంలో రోజుకు నాలుగైదు రైతు ఆత్మహత్యలు జరిగేవని, కానీ కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన సంస్కరణలతో బతుకులు మారాయని గుర్తుచేశారు. ఇవాళ ప్రతి రైతూ కేసీఆర్ వైపే చూస్తూ.. నా ఓటు కేసీఆర్‌కే అంటున్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.