Godavarikhani | యైటింక్లయిన్ కాలనీ, మార్చి 1 : కార్మిక సంక్షేమంకు పెద్దపీట అని ఊతపదంగా చెప్పుకునే సింగరేణి సంస్థకు పట్టదు.. సింగరేణి ప్రాంతం కావడంతో అటు రామగుండం బల్దియాకు గిట్టదు.. అనే పర్యవసానంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు ఇక్కడ కలగానే మిగిలిపోతోంది. సింగరేణి ఆర్జీ-2 పరిధి యైటింక్లయిన్ కాలనీ పట్టణంలోని అబ్దుల్ కలాం స్టేడియంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని యాజమాన్యం ప్రకటించి యేళ్లు గడిచిపోతుంది. ఆ ప్రతిపాదనను కేవలం కాగితాలకే పరిమితం చేసింది.
గోదావరిఖనిలో అనేక చోట్ల రూ.లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్ లను నిర్మించిన రామగుండం నగర పాలక సంస్థ ఇక్కడ మాత్రం వివక్ష ప్రదర్శించింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సైతం గతంలో ఇక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు ప్రస్తావన తీసుకవచ్చినా.. ఇప్పటికీ అమలుకు నోచుకోలేకపోయింది. కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం ఎంతో ఖర్చు చేస్తున్నామని చెబుతున్న సింగరేణి అధికారులకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి నిధులు లేవా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రతీ నెల కార్మిక సమస్యలపై స్ట్రక్చర్ మీటింగ్లో కూర్చునే కార్మిక సంఘాల నాయకులకు ఈ సమస్య కనిపించకపోవడం విడ్డూరమని కార్మిక లోకం ప్రశ్నిస్తుంది. ప్రతీ స్ట్రక్చర్ సమావేశంలో రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు, క్వార్టర్ల మరమ్మతులు సాధించామని ప్రగల్భాలు చెప్పుకునే గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు ఓపెన్ జిమ్ ఎందుకు ఏర్పాటు చేయించడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం కార్మికులు, స్థానికులు, యువకులు ఎంతోమంది స్టేడియంలో వ్యాయామం కోసం వెళ్తుంటారు. వీరి కోసమైనా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. సింగరేణి సంస్థనే పట్టించుకోనప్పుడు తమకెందుకు అన్నట్టుగా అటు నగర పాలక సంస్థ వ్యవహరిస్తుందని, ప్రచారంలో ఉంది. ఓపెన్ జిమ్ ఏర్పాటు అనివార్యమైనా.. ముందడుగు పడటం లేదు. సింగరేణి సంస్థకూ పెద్ద సమస్యేమి కాదు. ఇప్పటికైనా సింగరేణి గానీ, కార్పొరేషన్ గానీ స్పందించి త్వరితగతిన ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.