ప్రాజెక్టుల నిర్మాణంతో బీహెచ్ఈఎల్కు, రైతుబీమా, చేనేత బీమా, గీతన్నకు బీమాతోపాటు రాబోయే ప్రభుత్వంలో ‘ఇంటింటికీ బీమా- కేసీఆర్ ధీమా’ వంటి వినూత్న పథకానికి బీమా ప్రీమియం ఎల్ఐసీకే చెల్లించి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడతాం. కాంగ్రెస్, బీజేపీలు అమ్మకం అయితే బీఆర్ఎస్ నమ్మకం.
– మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): డిసెంబర్ 3 తర్వాత ఏర్పడే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్పీలు, వీఏవోల వేతనాలు రెట్టింపు అవుతాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆశా, అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్ ఇస్తామని స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్కే ఆధ్వర్యంలో 44 కార్మిక సంఘాలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ సీఎం కేసీఆరేనని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ను ఎదుర్కోలేక, కేసీఆర్‌ను తట్టుకోలేక కాంగ్రెస్, బీజేపీ రెండూ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్మికుల పొట్టకొడితే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కార్మికుల కడుపులు నింపిందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుప బూట్లు, గుర్రాలతో తొకించిన చరిత్ర కాంగ్రెస్ పాలకులదని గుర్తుచేశారు. కార్మికుల సమస్యలను తెలసుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశావర్కర్లు, సఫాయి కార్మికులు, హోంగార్డులు, చిరు ఉద్యోగులను అక్కున చేర్చుకొని వారి జీవితాలను బాగుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఇప్పటికే వీఏవోల వేతనాలను పెంచామని, మూడోసారి అధికారంలోకి వచ్చాక వారి వేతనాలను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇస్తే మంచినీళ్ల సమస్యను పరిష్కరించుకుండా కన్నీళ్లను మిగిల్చిన దుర్భర చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డల నీటి కష్టాలను మిషన్ భగీరథతో తీర్చామని తెలిపారు.
ఢిల్లీలో కొట్టుకుని గల్లీలో కలిసుంటాయి
కాంగ్రెస్, బీజేపీ రెండూ ఢిల్లీలో కొట్టుకుని గల్లీలో కలిసి ఉంటాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ సిద్ధించిందని సంబరాలు చేసుకుంటుండగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని ఏడు మండలాలను ఏపీలో కలిపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీలేరు పవర్ ప్రాజెక్టు దక్కకుండా చేశారని విమర్శించారు. బీజేపీ బిల్లు పెడితే కాంగ్రెస్ మద్దతిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట బీజేపీ, ఆ పార్టీ బలంగా ఉన్న చోట కాంగ్రెస్ మద్దతు ఇచ్చి పుచ్చుకుంటున్నాయని ఆరోపించారు. ఇందుకు దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వివరించారు.
కరువు, కర్ఫ్యూ కాంగ్రెస్‌కు పుట్టిన కవలలు. హింసా రాజకీయాలు, కర్ఫ్యూ వాతావరణ సృష్టికి కాంగ్రెస్ పెట్టింది పేరు. కరువు నేలలో సిరులు కురిపించిన దార్శనికుడు సీఎం కేసీఆర్.
– మంత్రి హరీశ్‌రావు
ఆడబిడ్డలను అక్కున చేర్చుకున్నది బీఆర్ఎస్సే
రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కున చేర్చుకున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి వాహనాలు, షీటీమ్స్ ఇలా అనేక విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో మహిళాభ్యుదయానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని కొనియాడారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, వీఏవోలు, ఆర్పీల వేతనాలు పెంచి వారి సేవలను సమున్నతంగా గౌరవించిదని తెలిపారు. రాష్ట్రంలోని 26వేల వీఏవోలు, ఆర్పీల గౌరవ వేతనాలను ఇప్పటికే పెంచామని, డిసెంబర్ 3 తరువాత ఏర్పడబోయే బీఆర్ఎస్ సర్కారు వారి వేతనాలను రెట్టింపు చేస్తుందని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్‌లో చిరు ఉద్యోగులకు తెలంగాణలో ఇస్తున్న వేతనాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు.
ఉపాధి మింగిన కాంగ్రెస్‌కు ఓటెయ్యాలా?
కాంగ్రెస్ హయాంలో కరెంటు లేక అన్ని రంగాలు కుదేలయ్యాయని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. కరెంటు లేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, పరిశ్రమలు మూతపడడంతో లక్షలాదిమంది కార్మికులు వలసలు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి మింగిన కాంగ్రెస్‌కు ఓటెయ్యాలా? అని నిలదీశారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పవర్ హాలీడే ఇచ్చిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కరెంట్ కష్టాలు దూరమయ్యాయని వివరించారు.
ట్రాన్స్‌పోర్టు బోర్డు ఏర్పాటు చేస్తాం
ఆటో కార్మికులకు త్రైమాసిక పన్నును రద్దు చేసింది సీఎం కేసీఆరేనని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. ఆటో, రవాణా కార్మికుల ట్రాన్స్పోర్ట్ బోర్డు ఏర్పాటు డిమాండ్‌ను మూడోసారి అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు తేలిపోయాని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుంటే వాటిని కాపాడడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కూడా అమ్మేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసిందని తెలిపారు. మాట తప్పే కాంగ్రెస్ కావాలా?.. మాట మీద నిలబడే కేసీఆర్ కావాలా? అంటే తెలంగాణ ప్రజలు మాట మీద నిలబడే కేసీఆర్‌వైపు ఉంటారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక ఇంటి పార్టీ బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. వచ్చే జనవరి నుంచి అన్నపూర్ణ పథకంతో సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్కే అధ్యక్షుడు రాంబాబుయాదవ్, సంఘం నాయకులు రూప్సింగ్, నారాయణ, దానకర్ణాచారి, మారయ్య, హనుమాండ్లు, మాధవి, సునీత, నిర్మల, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్ కుర్మ తదితరులు పాల్గొన్నారు.