చౌటుప్పల్, అక్టోబర్ 26: బీజేపీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో పెద్ద ఝూటా అని, మరోమారు మునుగోడు ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బుధవారం చౌటుప్పల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీ సర్కార్ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పారు. ఇదివరకు దేశంలో నాలుగు టెక్స్టైల్స్ పార్క్‌లు మంజూరైతే.. అందులో తెలంగాణ రాష్ర్టానికి మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దుబ్బాకలో గెలిచిన ఆరు నెలల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ అది సాధ్యం కాలేదని విమర్శించారు. ఇందుకు దుబ్బాక ప్రజలకు క్షమాపణలు చెప్పి, ముక్కు నేలకు రాయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మునుగోడులో వంద పడకల దవాఖాన, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పూర్తి పాత ముచ్చటేనని కొట్టిపారేశారు. 2016లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డా ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాన్ని ప్రకటించారని, కానీ ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదన్నర ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించిందని గుర్తుచేశారు.
మునుగోడు సభకు వచ్చే ముందు నడ్డా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పి ఇక్కడి ప్రజలను ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ర్టానికి రావాల్సిన మొత్తం రూ. 33,545 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ఇదివరకు సీఎం కేసీఆర్ కూడా అనేకమార్లు విన్నవిస్తే.. స్పందించని కేంద్రం ఇప్పుడస్తాననడం ఎంత వరకు కరెక్ట్ అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

ఉద్యోగాలు ఊడగొట్టిన బీజేపీ సర్కారు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగాలను కేంద్రంలోని బీజేపీ సర్కారు ఊడగొట్టిందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వే, ఎయిర్ పోర్టులు ఇలా అన్నింటిని ప్రైవేట్‌పరం చేసి ఎంతో మంది పొట్టకొట్టారని ఆవేదన చెందారు. ఆర్మీలో కూడా కాంట్రాక్టు ఉద్యోగాలిచ్చే దీనస్థితికి కేంద్రం దిగజారిందని విమర్శించారు. కృష్ణా నది జలాల్లో వాటా తేల్చకుండా నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రజలకు కేంద్రం అన్యాయం చేస్తున్నదని, దీనిపై నడ్డా సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టుల మీదే ప్రేమ
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు అభివృద్ధి కన్నా కాంట్రాక్టుల మీద ప్రేమ ఎక్కువగా ఉంటున్నదని హరీశ్‌రావు అన్నారు. 18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాజగోపాల్‌రెడ్డికి పైసల అహంకారం ఉన్నదని, దీనిని ప్రజలు తప్పకుండా దించుతారని ఆశాభావం వ్యక్తంచేశా రు. హుజూర్నగర్, నాగార్జునసాగర్‌లో ఇప్పటికే వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రేపు మునుగోడులోనూ సీఎం కేసీఆర్ ఇదేస్థాయిలో అభివృద్ధి చేస్తారని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ప్రభాకర్‌రెడ్డి గెలుపు అభివృద్ధికి మలుపు
మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు అభివృద్ధికి మలుపు అని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ హయాంలో, కేటీఆర్ పర్యవేక్షణలో మునుగోడు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బీజేపీ కాలం చెల్లిన పార్టీ అని విమర్శించారు. మునుగోడులో ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, శంకర్‌నాయక్, క్రాంతి కిరణ్, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మునుగోడులో నాయీ బ్రాహ్మణుల మద్దతు టీఆర్ఎస్కే
నాయీబ్రాహ్మణులకు 1.50 లక్షలతో ఆధునిక సెలూన్ ఏర్పాటు చేసుకొనేందుకు సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం బేగంపేటలో మునుగోడు నియోజకవర్గస్థాయి నాయీబ్రాహ్మణ సేవా సంఘంతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి సమావేశమయ్యారు. నాయీబ్రాహ్మణ నాయకులకు పింఛన్ల మంజూరుపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చారు.
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి నాయీబ్రాహ్మణులు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలక్రిష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రాజధానిలో నాయీబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనంకోసం రెండు ఎకరాల స్థలం, రూ.2 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు. కార్యక్రమంలో యాదాద్రి జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సీకిలమెట్ల శ్రీహరినాయీ, రాష్ట్ర నాయకుడు నరేందర్ నాయీ, ఉపాధ్యక్షుడు గడల రాజు తదితరులు పాల్గొన్నారు.