Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి, జానారెడ్డి.. ఇలా ఎంతోమంది సీఎం కావాలని కలలు కంటున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీలో కుర్చీల కొట్లాటలు ఎక్కువ.. ప్రయోజనాలు తక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొట్లాటలు, కుట్రలు, కర్ఫ్యూలు చూడాల్సి వస్తుందన్నారు. ఆ పార్టీ వస్తే రియల్ ఎస్టేట్ ఢమాల్ అని పడిపోతుందని.. భూముల రేట్లు పడిపోతాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీకి చెందిన బీర్ల శివకుమార్, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
రైతుబంధు సృష్టికర్త కేసీఆర్ కాదా?
అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పి ప్రజల్లోకి వస్తుందని నిలదీశారు. పక్కనే ఉన్న కర్ణాటక నుంచి వందలాది మంది రైతులు వచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని దండం పెట్టి పోతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మూడు గంటలే కరెంటు ఉంటుందని బాధపడుతున్నారు. 2004 నుంచి 2014 దాకా ఎరువు బస్తాలు కావాలన్నా.. కరెంటు కావాలన్నా.. నీళ్లు కావాలన్నా అనేక కష్టాలు పడ్డామని ఆనాటి రోజులను గుర్తు చేశారు. రైతుబంధు సృష్టికర్త కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కంటే ముందు ఎవరైనా రైతులకు పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇచ్చారా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలని అంటున్నాడని.. మూడు గంటలు ఇచ్చేవాళ్లు కావాలా? 24 గంటల కరెంటు ఇచ్చేవాళ్లు కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.
రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్
కాంగ్రెస్.. రైతు వ్యతిరేక పార్టీ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్లి రైతుబంధుపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఎప్పటిలాగే ఇస్తున్న దానిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. వాళ్లు రైతుల కడుపు కొట్టాలని చూస్తున్నారని అన్నారు. రైతుబంధు ఆపాలని చూస్తున్న రైతు వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని సూచించారు.
పింఛన్లు ఇస్తుండటంతో వృద్దులకు ఆసరా లభించిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. త్వరలో ఆసరా పింఛన్లను 5వేలకు పెంచబోతున్నామని అన్నారు. మహిళలకు నెలకు 3వేలు, రూ. 400 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ఏడాదికి 16 వేల రైతు బంధు ఇవ్వబోతున్నామని.. రేషన్ కార్డులు ఉంటే సన్నబియ్యం ఇవ్వాలని మేనిఫెస్టో ద్వారా చెప్పామని తెలిపారు. రైతు చనిపోతే బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తున్నారని.. రైతు బీమా తరహాలోనే కోటి కుటుంబాలకు బీమా కల్పించబోతున్నామని అన్నారు.
కేసీఆర్ అంటే ఒక నమ్మకం
కేసీఆర్ అంటే ఒక నమ్మకం అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అయితే జైత్ర యాత్ర లేదంటే.. నా శవయాత్ర అని వెళ్లి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వైద్యరంగంలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే.. నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవఖానా అనే విధంగా మార్పు వచ్చిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, జిల్లాకో మెడికల్ కాలేజీ వంటి వాటిని ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని అన్నారు.
రజినీలకు కనిపిస్తున్నది.. గజినీలకే అర్థం కావట్లేదు
హైదరాబాద్ నగర అభివృద్ధిపై బాలీవుడ్ హీరో, బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ప్రశంసలు కురిపించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం మెచ్చుకున్నారని తెలిపారు. పక్కన ఉన్న రజినీలకు ఇక్కడి అభివృద్ధి కనిపిస్తుంది.. కానీ ఇక్కడ ఉన్న గజినీలకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
పనితనం తప్ప.. పగతనం తెలియని కేసీఆర్
సంగారెడ్డి జిల్లాలో రోడ్లు బాగు అయ్యాయని.. జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిత్యం అందుబాటులో ఉండే చింతా ప్రభాకర్‌ను మెజారిటీతో గెలిపించాలని కోరారు. పనితనం తప్ప.. పగతనం తెలియని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.
కాంగ్రెస్‌లో అందరూ సీఎం కావాలని కలలు కనేవాళ్లే
కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి, జానారెడ్డి.. ఇలా ఎంతోమంది సీఎం కావాలని కలలు కంటున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీలో కుర్చీల కొట్లాటలు ఎక్కువ.. ప్రయోజనాలు తక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుట్రలు, కర్ఫ్యూలు చూడాల్సి వస్తుందని.. భూముల రేట్లు పడిపోతాయని అన్నారు.