Minister Harish Rao | నాలుగేండ్ల క్రితం వచ్చిన మెడికల్ కాలేజీకి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారట.. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి ఇప్పుడు కొబ్బరి కాయ కొడతారట అని విమర్శించారు. ఒక్క మెడికల్ కాలేజీకి నాలుగేళ్ల తర్వాత కొబ్బరి కాయ కొడితే.. మేం గతేడాది ఒకే సారి 8 మెడికల్ కాలేజీలకు కొబ్బరికాయలు కొట్టామని.. ఈసారి 9 కొట్టబోతున్నాం.. మరి మేమంత చెప్పుకోవాలని ప్రశ్నించారు. బీజేపీది పని తక్కువ.. ప్రచారం ఎక్కువ.. అంతా డబ్బు కట్టుకోవడమే అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ది చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. పనిచేసి ప్రజల హృదయాలు గెలుచుకోవాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని తెలిపారు.
కంటి వెలుగు పథకం కోటి పరీక్షల మైలు రాయిని అధిగమించిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. గ్యాస్ ధర ఎందుకు పెంచారని నిర్మలా సీతారామన్‌ను మహిళలు నిలదీస్తే సమాధానం చెప్పలేక వెళ్లిపోయారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 40 ఏండ్లు కాంగ్రెస్, 20 ఏండ్లు టీడీపీ అధికారంలో ఉండి ఎందుకు నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. 60 ఏండ్లలో వాళ్లు చేయలేనిది 8 ఏండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. అల్లావుద్దీన్ ద్వీపం లేదు.. కానీ కేసీఆర్ అనే అద్భుత ద్వీపం మన దగ్గర ఉందని అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కోటి మందికి చేరువైందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 50 పనిదినాల్లో ఇంతమందికి చేరడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంపై సీఎం కేసీఆర్ రోజువారీ సమీక్ష చేస్తున్నారని తెలిపారు. కోటి మార్క్ చేరడంలో కృషి చేసిన వైద్య సిబ్బందికి, వారికి సహకరిస్తున్న మున్సిపల్, పంచాయతీ శాఖలు, జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులకు అభినందనలు తెలిపారు. దృష్టి లోపాలు ఉన్నప్పటికీ చాలామంది చిన్న సమస్యే కదా అని వదిలేస్తుంటారు. కానీ కాలం గడుస్తున్నా కొద్దీ అదే పెద్ద సమస్యకు దారి తీస్తుంది. దీనికి పరిష్కారంగానే సీఎం కేసీఆర్ కంటి వెలుగు అనే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నివారింపదగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం నినాదంతో జనవరి 18న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతున్నది. అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహిస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆసుపత్రుల వద్దకు ప్రజలు రావడం కాదు, ఊరుకు, వాడకు ప్రభుత్వమే కదిలి వస్తున్నది. ఉచితంగా కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, అవసరం అయిన వారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా గ్రామాల్లో, పట్టణాల్లో ఈ కంటి వెలుగును శిబిరాలు కొనసాగుతున్నాయి. గడిచిన 49 పని దినాల్లో 99 లక్షల 81 వేల మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయి. ఈ రోజు పరీక్షలతో ఆ సంఖ్య కోటి మార్కును చేరింది. 50 పని దినాల్లో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం, అవసరం ఉన్నవారికి అద్దాలు పంపిణీ చేయడం గొప్ప విషయం. మన లక్ష్యం చాలా పెద్దది. World’s largest eye screening programme గా రికార్డు సృష్టించాలని కష్ట పడుతున్నాం. ప్రతి అవ్వకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి కంటి పరీక్షలు నిర్వహించాలి, వారి కంటి సమస్యలను దూరం చేయాలి అన్నదే మన సీఎం కేసీఆర్ గారి లక్ష్యం. అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ దేశానికి దిక్సూచి చేశారు. అక్కడితో ఆగకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తలచి, ప్రజల ఆరోగ్యం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఎలాంటి తారతమ్యం లేదు. మానవత్వం, మనిషితనం ఒక్కటే మాకు కనిపిస్తుంది. అందుకే కంటి వెలుగు పరీక్షలు చేసుకుంటున్న వారిలో రామ్ ఉన్నడు, రహీమ్ ఉన్నడు, రాబర్ట్ ఉన్నడు. ఎస్సీ ఉన్నడు, ఎస్టీ ఉన్నడు, ఓసీ ఉన్నడు.. స్త్రీలు ఉన్నరు, పురుషులు ఉన్నరు, ట్రాన్స్ జెండర్లు ఉన్నరు. కోటి మందిలో సుమారు 30 లక్షల మందికి కంటి పరీక్షకు ఉన్నట్లు గుర్తించి అద్దాలు అందించారు. అంటే వీరంతా ఇప్పటి వరకు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న సమస్య కదా అని పట్టించుకోని వారు కొందరైతే, కంటి సమస్య ఇబ్బంది పెడుతున్న ఆసుపత్రికి తీసుకువెళ్లే వారు లేక బాధపడిన వారు కొందరు. కంటి వెలుగు వల్ల వీరందరి సమస్య పరిష్కారం అయ్యింది. పరీక్ష చేయించుకున్న 71 లక్షల మందికి.. మాకు కంటి సమస్య లేదు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక మీదట మరింత జాగ్రత్త వహించాలనే ఆలోచన వచ్చింది.
ఇప్పటివరకు 49 రోజుల్లో పురుషులు 46,83,476ల మంది, మహిళలు 52,88,570 మంది, ట్రాన్స్ జెండర్ 3,279 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు చేయించుకొని, కళ్లద్దాలు తీసుకున్న ముసలవ్వ ముసలయ్యలు ఎంతో సంతోషపడుతున్నరు. పెద్ద కొడుకు లెక్క మా కళ్లు బాగుచేశాడు కేసీఆర్ అంటున్నరు. ఎవరూ అడగకముందే, ఇంటి పెద్ద కొడుకుగా ఆలోచించిన సీఎం కేసీఆర్, దృష్టి లోపాలు సవరించేందుకు 2018, ఆగస్టు 15న తొలి విడుత కంటి వెలుగు ప్రారంభించారు. మెదక్ జిల్లా మల్కాపూర్ లో ప్రారంభించిన ఈ కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగింది. కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రపంచంలోనే ఇంత పెద్ద కార్యక్రమం బహుశా మరెక్కడా జరిగి ఉండదు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న కళ్లద్దాలు పంపిణీ చేయగా, ఈ సారి మేడిన్ తెలంగాణ కళ్లద్దాలను ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నది. ఈసారి సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ మెడికల్ ఎక్విప్మెంట్ పార్క్ లో తయారు చేసిన కళ్లద్దాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. దీని వల్ల ఇక్కడి పరిశ్రమలకు మద్దతు అందటంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది.
కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం రూ. 250 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వైద్య సిబ్బంది కొరత లేకుండా 950 మంది వైద్యులను కొత్తగా తీసుకున్నది. కంటి వెలుగు సమయంలో ఇతర వైద్య సేవలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంటి వెలుగుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తుండడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తమ పెద్ద కొడుకు అని, కంటి సమస్యలు తొలగించి ఎంతో మేలు చేస్తున్నారని సంబరపడుతున్నారు.
ప్రజల సంక్షేమం కోసం, ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పథకం ఇది అని కొనియాడారు. ‘ బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి, తనువు చాలించే వరకు ప్రజా సమగ్ర అరోగ్య సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు సర్కారు దవాఖానకు పోతా అంటున్నారు. సంగారెడ్డి లో 84 శాతం డెలివరీలు సర్కారు దవాఖానలో అవుతున్నాయి. అడుగు దూరంలో పల్లె దవాఖానలు, పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని గస్తీ కాసే బస్తీ దవాఖానలు, 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసే తెలంగాణ డయాగ్నోస్టిక్స్, 3 నుంచి 102కు పెరిగిన డయాలసిస్ సెంటర్లు, రోగం ముదిరితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, పెద్ద రోగాలు నయం చేసే జిల్లా ఆసుపత్రులు, వైద్యంతో పాటు, వైద్య విద్యను అందించే మెడికల్ కాలేజీలు, పేషెంట్ కేర్ పెంచేందుకు నర్సింగ్ కాలేజీలు, చారిత్రక వరంగల్ పట్టణంలో హెల్త్ సిటీ నిర్మాణం, హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మాతా, శిశు సంరక్షణ కోసం ఎంసీహెచ్‌లు, నవజాత శిశు రక్షణ కోసం ఎస్ ఎన్ సీ యూలు, డీపీసీయూలు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం ఉచితంగా టిఫా స్కానింగ్ కేంద్రాలు, సులభతర ప్రసవాల కోసం మిడ్ వైఫరీ సిస్టం, బిడ్డ కడుపులో పడితే న్యూట్రీషన్ కిట్లు, బిడ్డ పుట్టిన వెంటనే కేసీఆర్ కిట్లు, గర్బిణులకు ఆర్థిక సాయం, అమ్మ ఒడి వాహనాలు, ఆలనా వాహనాలు, పరమపద వాహనాలు, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పాలసీ, పారిశుధ్య నిర్వహణ పాలసీ, ఆసుపత్రులలో రోగులకు డైట్ చార్జీల పెంపు, ఆసుపత్రులలో సహాయకులకు సబ్సిడీ భోజనం, ఆరోగ్యశ్రీ సేవల పరిధి 2 నుంచి 5 లక్షలకు పెంపు, పడకల సంఖ్య 17 వేల నుంచి 28 వేలకు పెంపు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం, ఇలా.. ఒక్కటా రెండా… తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు అమలు చేస్తున్న పథకాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలు చెబితే చాంతాడంత లిస్టు ఉంటది. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. ఇది నేను చెబుతున్న లెక్కలు కాదు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతి అయోగ్ చెప్పింది.’ అని అన్నారు.
‘ నీతి అయోగ్ ర్యాంకింగ్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎక్కడున్నాయి అని అంటే అట్టడుగున ఉన్నాయి. మళ్లీ వీళ్లు వచ్చి తెలంగాణకు నీతులు చెబుతరు. నీతి అయోగ్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మూడో స్థానంలో ఉంటే, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ 16వ ర్యాంకులో, ఛత్తీస్గడ్ 10వ స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ .. ఉత్తర్ ప్రదేశ్ ర్యాంకు ఎంత అంటే అట్టడుగు స్థానం. చిట్ట చివరి స్థానం. 30వ స్థానంలో ఉన్నోడు వచ్చి మూడో స్థానం వాడికి చెబుతడట. చెప్పుకుంటే సిగ్గు చేటు.. ఉత్తరప్రదేశ్‌లో అసలు ప్రభుత్వ పరిధిలో ఒక్క బీఎస్సీ నర్సింగ్ కాలేజీ కూడా లేదు. కానీ తెలంగాణలో మొత్తం 9 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసుకొని, 680 సీట్లు అందుబాటులోకి తెచ్చి, మన ఆడబిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. మాది చేతల ప్రభుత్వం, చేసేది చెబుతం. 40 ఏళ్లు కాంగ్రెస్, 20 ఏళ్లు తెలుగు దేశం వాళ్లు ఉండే ఎందుకు నీళ్లు ఇవ్వలేదు. వాళ్లు 60 ఏళ్లలో చేయనిది కేసీఆర్ 8 ఏళ్లలో చేశారు. మేనిఫెస్టో లో చెప్పనివి సైతం కేసీఆర్ అమలు చేసి చూపెట్టారు.’ అని తెలిపారు.