జమ్మికుంట : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చురకలంటించారు. ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచాల్సి వస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఈటల చెప్పారు. కానీ ఈటల రాజేందర్ ఆ ప్రతిపాదనను మరిచి మద్యం, డబ్బు, మిషన్లు, గడియారాలు, కుంకుమ భరణిలు పంచుతున్నారు. మాటకు కట్టుబడని వ్యక్తి రాజేందర్ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 500 మంది యువత గులాబీ గూటికి చేరారు. వీరందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరకముందే ఈ ప్రాంతం గులాబీ మయం అయిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఈటల గెలిచినప్పటి నుంచి ఆయన వెంట తామంతా ఉన్నామని తెలిపారు. ఈటల టీఆర్ఎస్ను వీడినా కూడా ఆయన వెంట ఎవరూ వెళ్లలేదు. టీఆర్ఎస్లోకి ఒక్కడే వచ్చిండు.. ఒక్కడే వెళ్లిండు అని హరీశ్‌రావు గుర్తు చేశారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కానీ ఈటల గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతాదా? హరీశ్ రావు అని ప్రశ్నించారు. 2014లో సిలిండర్‌కు దండం పెట్టు.. బీజేపీకి ఓటు వేయమని చెప్పారు. ఇప్పుడు సిలిండర్ ధరను తలుచుకొని టీఆర్ఎస్కు ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.