Harish Rao | మెదక్ : తెలంగాణ ఎన్నికల్లో డబ్బు పంచి గెలించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణకు చేరవేస్తోందని ఆయన ఆరోపించారు. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడైన అంబికా పతి, ఆయన భార్య అశ్వత్త ఇంట్లో రూ. 52 కోట్లు పట్టుబడ్డాయని మంత్రి తెలిపారు.
కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంట్రాక్టర్ల వద్ద 40 శాతం కమీషన్ వసూలు చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ 50 శాతం వసూలు చేస్తుందని మంత్రి ఆరోపించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ స్కాంగ్రెస్‌గా మారిందని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకొంటున్నట్టు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ ఎన్ని నోట్ల కట్టలు పంచినా, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.