Minister Harish Rao | కాంగ్రెస్, బీజేపీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రిని తిడుతున్నారని.. కేసీఆర్‌ను తిట్టడం అంటే తినే కంచంలో ఉమ్మేసుకోవడమేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ గజ్వేల్, సిద్ధిపేట ప్రతినిధుల సభల్లో పాల్గొని మాట్లాడారు. ‘ఏం తక్కువ చేసిండు కేసీఆర్.. కన్నకొడుకు లాగ కంటి వెలుగు పెట్టి ఊరూరికి డాక్లర్లను తోలి కంటి పరీక్షలు చేయించి కంటి అద్దాలు ఇచ్చిండు.. పెద్ద కొడుకు లాగా ఆసరా పెన్షన్, మేనమామ లాగ ఆడపల్లి లగ్గానికి కల్యాణక్ష్మి, పెద్దన్నలాగ ఎకరానికి రూ.10వేలు రైతుబంధు, ఇలా ఎన్నో చేసిన కేసీఆర్‌ను తిట్టడానికి మీకు నోరు ఎలా వస్తది అని అడుగుతున్నా’.. ధ్వజమెత్తారు. సూర్యుడి మీద ఉమ్మేస్తే.. అది వచ్చి మీ మొఖం మీద పడ్డట్టు ఉంటుందన్నారు. కేసీఆర్‌ను తిడితే పెద్ద లీడర్లు అవుతామాని అనుకుంటారని.. కానీ, ప్రజలు మిమ్మల్ని సహించరన్నారు.
ప్రజలు అంతా కేసీఆర్ వైపు ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓట్ల కోసం ట్రిక్కులు కొడుతున్నారని విమర్శించారు. ఎన్ని ట్రిక్కులు కొట్టిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేది ఖాయమన్నారు. కలలో కనని పనులు చేసుకున్నామన్నారు. నాడు కరెంట్ కోసం ఎన్ని కష్టాలు పడ్డామో మనందరికీ తెలుసునని, ఎట్లున్న తెలంగాణ ఎట్లయ్యిందో, ఎనిమిదేండ్లలోనే ఇంత మార్పు వచ్చిందంటే కేసీఆర్ కృషేనన్నారు. కేసీఆర్ అద్భుత దీపంతోనే ఇంత మార్పు జరిగిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప మాట.. నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒక గొప్ప మాటను ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు.
‘నిజాన్ని రోజు మాట్లాడాలి. నిజాన్ని ప్రచారంలో పెట్టాలి. ఒకవేళ నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతది. అబద్ధం రాజ్యమేలితే రాష్ట్రాలు దేశాలు, ప్రపంచం నాశనమయ్యే ప్రమాదం ఉంది. నిజాలు కూడా మాట్లాడుతూనే ఉండండి. నిజాలను ప్రజలకు చెబుతూనే ఉండండి’ అని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను మంత్రి హరీశ్‌రావు ప్రస్తావించారు. యువత, విద్యార్థులు ఎక్కడికక్కడ మనం చేసిన అభివృద్ధిని చెప్పాలని, గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే జిల్లాలు ఏర్పడేవా..? జిల్లాకు మెడికల్ కళాశాలలు వచ్చేవా? అని ప్రశ్నించారు. అని అన్నారు. ఇవన్నీ సాధ్యమైనవి అంటే సీఎం కేసీఆర్ చలవతోనే అని అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా…? వీటన్నింటిపై యువత గ్రామాల్లో చర్చ పెట్టాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.