Minsiter Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటం, పదవులు మారుతాయంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు తెలివైనవాళ్లు అని, సీఎం కేసీఆర్ పాలనను కాదనుకోరని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు 56 ఇంచుల ఛాతి లేదేమోగానీ, తెలంగాణలో ప్రతి ఇంచు మీద అవగాహన ఉన్నదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధ్యక్షులను మార్చినా, నాయకులను బుజ్జగించినా, మంత్రి పదవులు మార్చినా ప్రజల ఆలోచనల్లో మార్పు ఉందడని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో రెండో స్థానం కోసమేనని స్పష్టంచేశారు. ప్రస్తుతం తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నదని గుర్తు చేశారు. ఏ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రంతో పోల్చినా తెలంగాణ అగ్రభాగన ఉన్నదని స్పష్టం చేశారు. ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అనే స్థాయికి చేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని అన్నారు. మహారాష్ట్రకు వెళ్లినప్పుడు తెలంగాణ పోలీసులకు ఇస్తున్న ఇన్సెంటివ్‌ల గురించి అక్కడి పోలీసులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని, తమకూ కావాలని ఆకాంక్షించారని తెలిపారు.