సర్కార్ భూములు ఆక్రమించి ఇండ్లు కడితే కూల్చివేయడం చూశాం. చెరువు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపడితే బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం కూడా అనుభవమే. భూ తగాదాల్లో బలవంతుడి పక్షాన నిలిచి బలహీనుడి కలల సౌధాన్ని నేలమట్టం చేసిన ఘోరాలను తిలకించాం.
కానీ ఇది అంతకుమించి.. రాజకీయం, అధికారం కుమ్మక్కై బరితెగిస్తే సామాన్యుడికి దక్కే ఆటవిక న్యాయం ఎలా ఉంటుందో పెద్దమంగళారం పరిధిలో జరిగిన ఇండ్ల కూల్చివేతలే ప్రత్యక్ష నిదర్శనం. సర్కార్ పెద్దలు అండగా ఉంటే, అధికారులు కీలుబొమ్మలుగా మారితే, కన్నేసిన భూములను చెర పట్టేందుకు సామాన్యుల ఇండ్లను సైతం కూల్చి స్వాధీనం చేసుకోవచ్చనే ‘రియల్’ మాఫియా దౌర్జన్యకాండకు నిలువెత్తు సాక్ష్యం. రెండేండ్లుగా హైదరాబాద్ మహానగరంతోపాటు శివారు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ‘బిగ్’ భూ దందాల్లో ఇది మరో రకం.
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మొయినాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం పరిధి.. అదంతా పట్టా భూమి. 35 ఏండ్ల కిందటే ప్లాట్లు చేసి అమ్మారు. అవి చేతులు మారుతూ వస్తున్నాయి. పాలమూరుకు చెందిన కొందరు గిరిజన కుటుంబాలు సొంతూళ్లలోని భూములను అమ్ముకొని ఇక్కడ ప్లాట్లు కొన్నారు. కొంతమంది పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ముతో ఇండ్లు కట్టుకున్నారు. నిర్మాణ సమయంలో అధికారులు అటువైపు రాలేదు, పైగా ఇంటి నంబర్లు కేటాయించారు, కరెంటు మీటర్లు ఇచ్చారు.
కానీ అదే అధికారులు కొన్నిరోజుల కిందట బుల్డోజర్లతో వచ్చారు. అమాయక గిరిజనుల కుటుంబాలను బయటికి పంపి ఇండ్లను నేలమట్టం చేశారు. అదేమని అడిగితే ‘111 జీవో కదా! కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి’ అని సమాధానమిస్తున్నారు. ఇండ్లు కట్టినప్పుడు, మీటర్లు ఇచ్చినప్పుడు, ఇంటి నంబర్లు ఇచ్చి, ఆస్తి పన్ను వసూలు చేస్తున్నప్పుడు గుర్తుకురాని 111 జీవో నిబంధనలు ఇప్పుడే ఎందుకు అడ్డం వచ్చాయి? 111 జీవో పరిధిలో కేవలం అమాయక గిరిజనులకు చెందిన ఈ పది ఇండ్లు మాత్రమే ఉన్నాయా? మిగిలిన ఇండ్ల సంగతేమిటి? ఇంతకీ… కూల్చివేతలకు అసలు కారణం 111 జీవోనేనా? ఇంకేమైనా మతలబు ఉన్నదా?
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని పెద్దమంగళారం గ్రామ రెవెన్యూలోని సర్వే నంబర్ 210, 211, 212లలో 17.20 ఎకరాల భూమిని కొందరు రైతుల నుంచి 1986లో రాఘవేంద్ర కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (డాక్యుమెంట్ నెంబర్లు-458, 459, 460/86, 2393/87) కొనుగోలు చేసింది. అనంతరం ఆ భూముల్లో లేఅవుట్ చేసింది. కాలానుగుణంగా ప్లాట్లను అమ్మడం, కొన్నవాళ్లు ఇతరులకు విక్రయించడం.. ఇలా అవి చేతులు మారుతూ వస్తున్నాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 50 గిరిజన కుటుంబాలు ఏడేండ్ల కిందట ఈ లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేశాయి. సొసైటీ నుంచి వాళ్లు కొనుగోలు చేసేవరకు ఉన్న ఈసీని, అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. సొంత గ్రామాల్లో తమకు ఉన్న కొద్దిపాటి భూములు, ఇంటి స్థలాలు అమ్ముకుని పూర్తిగా ఇక్కడికి వలస వచ్చి ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నారు. ఇండ్లు కట్టుకోలేని వాళ్లు ప్రీకాస్ట్తో ప్రహరీ వేసుకొని అందులో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు.
ఇండ్లు కట్టే సమయంలో అధికారులు కూడా చూశారు. కరెంటు మీటర్లు ఇచ్చారు. మున్సిపాలిటీ నుంచి ఇంటి నెంబర్లు కేటాయించి, ఆస్తి పన్ను కూడా వసూలు చేస్తున్నారు. కానీ ఉన్నఫలంగా గత నెల 30న పోలీసులు, మున్సిపల్, హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చి బుల్డోజర్లతో ఇండ్లు, గుడిసెల్ని నేలమట్టం చేశారు. అమాయక గిరిజనులకు అసలు ఏం జరుగుతున్నదో తెలియక తల్లడిల్లిపోయారు. కండ్ల ముందే ఇండ్లు కూలుతుంటే నిస్సహాయంగా వేదనపడ్డారు. తెరవెనుక సర్కార్ పెద్దలు, తెర మీద అధికారగణం ఉండటంతో శిథిలాల మధ్య రోదించడం తప్ప వాళ్లు ఏమీ చేయలేకపోయారు.
జంట జలాశయాల పరిధిలో అమల్లో ఉన్న 111 జీవోలో ఏకంగా 84 గ్రామాలు ఉన్నాయి. పది, ఇరవై అంతస్తుల భవంతులు సహా లక్షల నిర్మాణాలున్నాయి. అధికారులు అందులో వేటి జోలికీ వెళ్లలేదు. కానీ ఇక్కడే ఎందుకు కూల్చివేతలు చేపట్టారనే దానిపై ‘నమస్తే తెలంగాణ’ లోతుగా విచారించగా.. తెర వెనుక ప్రభుత్వ పెద్దలతో కూడిన రియల్ మాఫియా ఉన్నట్టు తేలింది. అమాయక గిరిజనుల ఇండ్లు కూల్చి భయభ్రాంతులకు గురి చేస్తే అడిగే దిక్కు కూడా ఉండదనే ధైర్యంతో ఈ దుస్సాహసానికి పాల్పడినట్టు తేలింది. వాస్తవానికి రాఘవేంద్ర కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 1986లో వెంచర్ చేయగా సుమారు 77 ప్లాట్లు అమ్ముడుపోయాయి. 46 ప్లాట్ల వరకు మిగిలిపోయాయి.
వినియోగదారులకు అమ్మిన ప్లాట్లతోపాటు మిగిలిన 40 ప్లాట్లను గంపగుత్తగా కొనేందుకు శ్రీనివాస్‌రాజు, సురేశ్‌రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు 1998లో రాఘవేంద్ర కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి సెబాస్టియన్‌తో ఒప్పందం చేసుకున్నారు. మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలనేది ఒప్పందంలోని షరతు. కానీ నిర్ణీత సమయంలో వ్యాపారులు రాకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు సొసైటీ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపింది. పత్రికల్లో బహిరంగ ప్రకటన ఇచ్చింది. ఆ తర్వాత 2005లో ఇద్దరు వ్యాపారులు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. కానీ అందులో వ్యవసాయ భూమిపై ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు.
కోర్టు ఇచ్చిన డిక్రీ మేరకు 2011లో వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆపై పద్నాలుగు ఏండ్ల తర్వాత.. అంటే గత నెల ఇద్దరు వ్యాపారులు వచ్చి తమ డాక్యుమెంట్ల ఆధారంగా మూడు సర్వే నంబర్లలోని పదహారు ఎకరాల భూమికి పాసు పుస్తకాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ భూములను ఏనాడో లేఅవుట్ చేసి ప్లాట్లుగా మార్చారని, ఆ మేరకు రికార్డుల్లో కూడా వ్యవసాయేతర భూమిగానే నమోదైందంటూ తహసీల్దార్ దరఖాస్తును తిరస్కరించారు. అయితే తన వెనుక బిగ్ బ్రదర్స్ ఉన్నారని ఒత్తిడి చేసినా రెవెన్యూ అధికారులు కుదరదని తేల్చి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

రెవెన్యూ శాఖ నుంచి పాసు పుస్తకాలు రాకపోవడంతో సదరు ఇద్దరు రియల్ వ్యాపారులు స్థానికంగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నేతలను సంప్రదించినట్టు తెలిసింది. వాళ్లు ఇద్దరు సదరు వ్యాపారులతో అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో వ్యవహారం కాస్తా ‘బిగ్’ మలుపు తీసుకున్నది. దీనికితోడు వ్యాపారులతో అగ్రిమెంట్ చేసుకున్న కాంగ్రెస్ నేతల్లో ఒకరు పోలీసు అధికారి బంధువు కాగా, మరో వ్యక్తి తన వైపు నుంచి నియోజకవర్గ ప్రజాప్రతినిధి తనయుడిని భాగస్వామిగా చేశాడు.
దీంతో తెర వెనుక బలగం పెద్దదైంది. పాసు పుస్తకాల కోసం ఆర్డీవోపై సదరు పోలీసు అధికారి, నియోజకవర్గ ప్రజాప్రతినిధి తనయుడు సైతం ఒత్తిడి తెచ్చినా అధికారులు మాత్రం ప్లాట్లు అయిన భూముల్లో పాసు పుస్తకాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అయితే లే అవుట్లో గిరిజనులకు చెందిన ఇండ్లు, గుడిసెలు తప్ప మిగిలినవన్నీ ప్రహరీలు ఉన్న ఖాళీ ప్లాట్లుగానే ఉన్నాయి. దీంతో గిరిజనులను ఎలాగైనా అక్కడి నుంచి పంపించివేస్తే.. భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకోవచ్చని, ప్లాట్ల యజమానులు వస్తే భయపెట్టి పంపొచ్చని స్కెచ్ వేశారు.
ఇందుకు మున్సిపల్ బిల్ కలెక్టర్ మొదలు కరెంటు మీటర్ రీడర్ వరకు పలువురితో ఆ గిరిజనులపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. అయినా వాళ్లు వినకపోవడంతో 111 జీవో అస్ర్తాన్ని ఉపయోగించారు. 111 జీవో పరిధిలో నిర్మాణాలు నిషేధమని, అయినా కొందరు నిర్మాణాలు చేపట్టారని గిరిజనుల ఇండ్లు లక్ష్యంగా హైకోర్టును ఆశ్రయిం చి కూల్చివేత ఉత్తర్వులు తీసుకువచ్చారు. చేవెళ్ల ఏసీపీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని 100 మంది సిబ్బందిని, 100 మంది బౌన్సర్లను తీసుకొచ్చి కూల్చివేతలు చేపట్టి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేశారు.
గిరిజనుల ఇండ్లను కూల్చివేయడంపై మీడియా, ఇతరులు అధికారులను ప్రశ్ని స్తే.. 111 జీవోలో నిర్మాణాలు నిషేధమైనందున హైకోర్టు ఉత్తర్వుల మేరకు కూ ల్చివేతలు చేపట్టామని సమాధానం ఇ చ్చారు. వాస్తవానికి పెద్దమంగళారంతోపాటు 111 జీవో గ్రామాల పరిధిలో లక్షలాది ఇండ్లు ఉన్నాయి. విద్యా సంస్థలకు లక్షల చదరపు అడుగుల భవంతులు ఉన్నాయి. కానీ ఏనాడూ అధికారులు ఏ ఒక్క నిర్మాణం జోలికి వెళ్లలేదు. పైగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఆయన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా హై డ్రా కూల్చివేతల సందర్భంగా 111 జీవో పరిధిలో నిర్మాణాలను కూల్చివేయం అని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు కోర్టు ఉత్తర్వులు అంటూ ఇండ్లను కూల్చివేశారు. ఇంతకంటే దౌర్జన్యం, ఘోరం ఇంకోటి ఉం టుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.