పేదరికంలో పుట్టింది. పుస్తకాలు చదువుకుంటూ సంతోషంగా పెరగాల్సిన బాల్యం పొయ్యిలో మంటలు ఎగదోస్తూ మసకబారిపోయింది. బాల్య వివాహం చదువుకే కాదు ఆమె ఆశలకూ అడ్డుగోడ కట్టింది. అయినా సరే ఆ నాలుగు గోడల మధ్య ఆమె ఎన్నో కలలు కన్నది. రాజస్థానీ రుచులకు, మార్వాడీ మాటలు పులిమి కమ్మని వంటలెన్నో యూట్యూబ్‌లో వడ్డించింది. ప్రపంచం నలుమూలలా ఉన్న మార్వాడీలంతా ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. అంతే… లక్షల్లో సంపాదనతో ఆమె పేదరికాన్ని జయించింది. సోషల్ మీడియా స్టార్‌గా ఎదగడమే కాదు సొంత బ్రాండ్‌తో ఆహార ఉత్పత్తుల తయారీలోనూ విజయం సాధించింది సీధీ మార్వాడి చానెల్ క్రియేటర్ కౌసల్యా చౌదరి.
నిరుద్యోగం, పేదరికానికి రాజస్థాన్ పల్లెలు చిరునామాలు. ఆ సమస్యల నుంచి బయటపడాలని పొట్టచేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలెన్నో! అలాంటి కుటుంబాలకు కొదువలేని ఊరు కురి. జోధ్‌పూర్‌కి దగ్గర్లో ఉంటుందీ పల్లె. ఇదే గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది కౌసల్య. తల్లిదండ్రులు తమకున్న కాస్త పొలంలో పనులు చేసుకునేవాళ్లు. ఓవైపు చదువుకుంటూనే ఇంటిపని, వంటపని చేసేది కౌసల్య. ఇంటర్ చదివే రోజుల్లో డాక్టర్ కావాలనుకుంది. కానీ, ఆ కోరిక నెరవేరకుండానే కౌసల్యకు పెండ్లి చేశారు పెద్దలు. అక్కడితో ఆమె చదువుకు ఫుల్స్టాప్ పడ్డట్టయింది. భర్త, ఇంటిపనులు, పిల్లల సంరక్షణే జీవితంగా మారిపోయింది.
రోజులు గడిచిపోతున్నాయి. అందరి చేతుల్లోకి ఫోన్ వచ్చింది. అందులో ఇంటర్నెట్ వచ్చింది. సామాజిక మాధ్యమాల జోరు హెచ్చింది. ఫోన్లో వీడియోలు చూసే కౌసల్యకు తను కూడా ఏదైనా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. తనకు తెలిసింది వంటలే. ఇంకేముంది నాయనమ్మ, అమ్మమ్మ కాలంలో వండి వార్చిన పదార్థాలను గుర్తు చేసుకుంది. తాను ఆ వంట చేస్తూ ఫోన్లో వీడియో రికార్డు చేసింది. ఏడున్నర వేల రూపాయల ఫోన్లో వీడియో ఎంత క్లారిటీగా వస్తుందో వేరే చెప్పనక్కర్లేదు.
వంటింట్లో చీకటి, ఆరుబయట వీడియో తీద్దామంటే అందరూ ఏమనుకుంటారో అన్న అనుమానం! ఓ ఎల్ఈడీ లైటు వెలుతురులో ఆపసోపాలు పడి వంట తయారీని రికార్డు చేసింది. తీసిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేయడం గగనమైంది. అందీ అందని సిగ్నల్‌తో ఇబ్బంది పడుతూనే ఆ వీడియోని అందరికీ చేరువ చేసేందుకు ఇల్లెక్కింది. ఇంటి మీద గంటలు గడుపుతూ యూట్యూబ్‌లో ఆ వీడియోని అప్లోడ్ చేసింది. తన కష్టం ఫలించింది. యూట్యూబ్‌లో సీధీ మార్వాడీ (Sidhi Marwadi) చానెల్ క్రియేట్ అయింది. ఒక వీడియో అప్లోడ్ అయింది. అవధుల్లేని సంతోషంతో ఇక వంటలతో ప్రయోగాలు చేస్తూ, వీడియోలు తీయడం మొదలుపెట్టింది కౌసల్య.
పాత వంటకాలను గుర్తుచేసుకుని, వాటికి కావాల్సిన దినుసులు సిద్ధం చేసుకుని, వీడియో వంట కోసం తయారయ్యేది కౌసల్య. ఆమె భర్త వీరేందర్ సరన్ తన వ్యవసాయ పనులన్నీ పూర్తి చేసుకుని కెమెరామెన్‌గా మారేవాడు. పిల్లలు ఎల్ఈడీ బల్బ్ పట్టుకుని లైట్ బాయ్స్ అవతారం ఎత్తేవారు. ఒక్కోసారి వంటలు చేసేందుకు ఇతరుల సాయమూ అవసరమయ్యేది. అందుకు తన ఇద్దరు పిల్లలతోపాటు కుటుంబ సభ్యులూ ఆమె వెంట నడిచారు.
అనుకున్నట్టుగా వీడియోలు తీసినా.. వాటికి అంతగా ఆదరణ లభించలేదు. ఇలా పద్దెనిమిది నెలలు గడిచిపోయాయి. ఓ రోజు వాళ్ల నాయనమ్మ అద్భుతమైన సలహా చెప్పింది. రాజస్థాన్‌లో స్థానికులు ఎంతోమంది మాట్లాడే మార్వాడీ భాషలో చెబితే ఇష్టంగా వింటారని సలహా చెప్పింది. బామ్మ మాట బంగారు మాట అనుకుని అదే పాటించింది కౌసల్య. రోజుల వ్యవధిలోనే ఆమె ఎందరికో రీచ్ అయింది. స్థానిక వంటలు వండుతూ, స్థానికులు మాట్లాడే మార్వాడీ భాషలో మాట్లాడుతూ చక్కగా వీడియోలు చేసింది. చూస్తుండగానే ఇబ్బడిముబ్బడిగా వ్యూస్ పెరిగాయి.
రాజస్థానీ లోకల్ వంటకాలను, తాతలనాటి రుచులను యూట్యూబ్‌లో పరిచయం చేస్తున్నది కౌసల్య. నెల రోజుల్లోనే సబ్‌స్ర్కైబర్ల సంఖ్య లక్ష మార్కు దాటింది. తను చేసిన వీడియోలతో పది రోజుల్లోనే లక్ష రూపాయలు సంపాదించింది కౌసల్య. ఫాలోవర్లు, లైక్‌లు, షేర్లతో కౌసల్య సోషల్ మీడియా స్టార్ అయిపోయింది! ‘ఈ వీడియోలు చూస్తూ, మీ మాటలు వింటుంటే మా అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ గుర్తొస్తున్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచం నలుమూలలా ఉన్న మార్వాడీలు తమ మూలాలను, చిన్ననాటి జ్ఞాపకాలను కామెంట్స్‌లో షేర్ చేసుకుంటున్నారు.
కౌసల్య విజయం టెడెక్స్ దృష్టికి వెళ్లింది. ఐఐటీ జోధ్‌పూర్‌లో టెడెక్స్ నిర్వహించే సదస్సులో స్ఫూర్తిమంతమైన ప్రసంగం కోసం ఆమెను ఆహ్వానించింది. ఆ వేదికపై తన విజయగాథను సగర్వంగా అందరితో పంచుకుంది. మాస్టర్ చెఫ్ ఇండియా 2023 ఆహ్వానం అందింది. ఆ పోటీలో ఫైనల్‌కి చేరిన పన్నెండు మందిలో ఆమె ఒకరు. యూట్యూబ్ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ రిపోర్ట్‌లో ఎంపికైన ఒకే ఒక రాజస్థాన్ యూట్యూబర్‌గా ఆమెకు గుర్తింపుదక్కింది. ఇలా అవార్డులు, సభలు, సన్మానాలతో కౌసల్యా చౌదరి ఓ సెలెబ్రిటీ అయిపోయింది. అప్పుడెప్పుడో ఆపేసిన చదువును మళ్లీ మొదలుపెట్టింది. దూరవిద్యా విధానంలో జోధ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎంఏ పూర్తి చేసింది.
సీధీ మర్వాడీ చానెల్ వల్ల పెరిగిన ఆదరణ, గౌరవంతో ఆ రుచులు వండుకోవడం ఎలాగో చెప్పడమే కాదు, వండుకునేందుకు కావాల్సిన మసాలాలు, నూనెలతో వ్యాపారంలోకి అడుగుపెట్టింది కౌసల్య. రెండేండ్ల కిందట ‘సీధీ మార్వాడీ’ బ్రాండ్ నెలకొల్పి మసాలా పౌడర్లు, గానుగ నూనెలను విక్రయిస్తున్నది. మూడు రకాల మసాలాలు, నాలుగు రకాల నూనెలు అందుబాటులోకి తెచ్చింది.
తన గ్రామంలోనే మొదటి బ్రాంచ్ని ఏర్పాటుచేసింది. ముప్పై మంది మహిళలతో తయారీ యూనిట్‌ని నెలకొల్పింది. తన ఉత్పత్తులను విక్రయించే ప్రత్యేకమైన స్టోర్లను ఏర్పాటు చేసి కొందరికి ఉపాధి, ఎందరికో స్వచ్ఛమైన ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నది. ఆదాయం పెరిగినా, ఆదరణ పెరిగినా ఇప్పటికీ తన ఊళ్లోనే ఉంటున్నది కౌసల్య. యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తూనే వ్యాపారాన్ని చూసుకుంటున్నది.