హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ) : ఎన్ని కార్పొరేషన్లు చేసినా హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎగిరేది మాత్రం కచ్చితంగా గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధీమా వ్యక్తంచేశారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో 12 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. పూజకు పనికిరాని పువ్వు బీజేపీ అని ఎద్దేవా చేశారు. వెట్టి పనికైనా, మట్టి పనికైనా ఇంటోడు ఉండాలని పెద్దలు చెప్తారని, అందుకే ఈ రాష్ర్టానికి బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామరక్ష అని స్పష్టంచేశారు.
తెలంగాణ భవన్లో గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గ యువ నేత విజయ్‌కుమార్‌రెడ్డి తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరగా, కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడినా కార్యకర్తలే పార్టీకి వెన్నెముకగా నిలుస్తూ, కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. మొత్తం హైదరాబాద్‌లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు. అక్కడి 24డివిజన్లలో క్లీన్ స్వీప్ చేసే సత్తా మనకున్నదని కేటీఆర్ తేల్చిచెప్పారు.
రాష్ర్టానికి బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామరక్ష. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, పన్నెం డేండ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు చేసిందేమీ లేదు. వచ్చే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటేయాలో? ఎందుకు వేయాలో ఆలోచించాలి. కేసీఆర్ ఏం చేశారో మహిళా ఓటర్లు ఆలోచించాలి.
– కేటీఆర్

వచ్చే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి? ఎందుకు వేయాలో ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే లేడని భయపడొద్దని, ఏ అవసరమొచ్చినా బీఆర్ఎస్ అందుబాటులో ఉంటందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ఏం చేశారో మహిళా ఓటర్లు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నేపథ్యంలో డివిజన్లవారీగా సమావేశాలు పెట్టుకుందామని కేటీఆర్ చెప్పారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, విజయ్‌కుమార్‌రెడ్డి వంటి యువకులు పార్టీకి ఆస్తి అని కొనియాడారు.
కేసీఆర్ హయాంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉండేవని, నేడు రేవంత్ పాలనలో హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ వచ్చాక హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలే సుల్తాన్‌బజార్‌లో తుపాకీతో బెదిరించి చోరీలు, చందానగర్‌లో జ్యువెలరీ షాపులపై దా డులు జరుగుతున్నాయని తెలిపారు. నేరాల ని యంత్రణలో పోలీసులు విఫలమయ్యారని మం డిపడ్డారు. వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు కుదేలయ్యాయని, కొత్త కొలువులు రాకపోగా ఉన్నవి పోయే పరిస్థితి దాపురించిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏం చేయాలో కాంగ్రెస్ నేతలు ఇప్పుడే నేర్పిస్తున్నారని, ఇంతకంటే డబుల్ ఆడుకుంటామని మాజీ మంత్రి శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన కేసీఆర్‌ను పట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి నీచమైన భాష మాట్లాడుతూ రంకెలేస్తున్నారని, దేవుడు అన్నీ గమనిస్తూనే ఉన్నాడని ఆ పాపం ఊరికే పోదని హెచ్చరించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని, మరో 15 ఏండ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల తరహాలో కౌంటింగ్ రోజు కూడా కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నందున బీఆర్ఎస్ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. అనుక్షణం కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడంతో పాటు ఓట్ల లెక్కింపులో ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. అవసరమైన సందర్భాల్లో రీకౌంటింగ్‌కు సిఫారసు చేయాలని కోరారు. గురువారం బీఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం వీరోచిత పోరాటం చేసిన బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యి చైర్మన్, చైర్పర్సన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక పూర్తయ్యేదాకా అనుక్షణం పర్యవేక్షించాలని సూచించారు. పార్టీ ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు హక్కు వినియోగంపై పార్టీ ద్వారా సమాచారం తెలియజేస్తామని చెప్పారు.
పోలింగ్ మాదిరిగా లెక్కింపు రోజు కూడా కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఓట్ల లెక్కింపులో ఏమాత్రం తేడా వచ్చినా రీ కౌంటింగ్‌కు సిఫారసు చేయాలి.
– కేటీఆర్