హైదరాబాద్, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ సమయంలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు నెలకొల్పాయి. ఎన్నికల కోడ్, ఈసీ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ మద్యం విక్రయాల ప్రవాహం ఆగలేదు. పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మద్యం దుకాణాలను బంద్ చేయించినా ఆబ్కారీ శాఖకు గిరాకీ తగ్గలేదు. రాష్ట్ర ఆబ్కారీ శాఖ లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఒకరోజు తర్వాత రోజైన జనవరి 29వ తేదీ నుంచి ఈ నెల 9 వరకు దాదాపు 12 రోజుల్లో రూ.1,282 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
అంటే రోజుకు సగటున రూ.107 కోట్ల చొప్పున మద్యం వ్యాపారం జరిగింది. నిరుడు ఇదే 12 రోజుల్లో రూ.872 కోట్ల విలువైన మద్యం విక్రయాలే జరిగినట్టు ఎక్సైజ్ నివేదికలు చెప్తున్నాయి. ఈ లెక్కన మద్యం రాబడి ఏకంగా 47 శాతం వృద్ధి నమోదైంది. విచిత్రం ఏమిటంటే పోలింగ్‌ను పురస్కరించుకొని ఫిబ్రవరి 9న సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11 సాయంత్రం వరకు 2 రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అయినా ఆ రోజుల్లో కూడా మద్యం అమ్మకాల జోరు తగ్గలేదు.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఓటర్లను మద్యం బాటిళ్లతో ప్రలోభపెట్టినట్టు ఎక్సైజ్ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ నిబంధనలు అమల్లో ఉన్నా, అబ్కారీ శాఖ నిబంధనలు ఉన్నా.. వాటిని పక్కనబెట్టి మద్యం విక్రయాలు చేపట్టినట్టు తెలుస్తున్నది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ గత నెల 28న నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఈనెల 11న ఎన్నికలు జరిగాయి.
ఈసీ నిబంధనల ప్రకారం గత ఏడాది ఇదే రోజుల్లో ఎంత మద్యం అయితే విక్రయించారో? ఇప్పుడు కూడా అంతే మద్యం విక్రయాలు ఉండాలి. అంతకు మించకూడదనే కచ్చితమైన నిబంధన ఉన్నది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రతి మద్యం దుకాణంలో ఎంత మద్యం విక్రయించారో? లెక్కలు తీసి ఎక్సైజ్ కమిషనర్, ఎన్నికల కమిషన్‌కు పంపాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ గత ఏడాదిలో ఇదే 12 రోజుల్లో జరిగిన విక్రయాలతో సరిపోల్చి చూస్తే 47 శాతం అదనపు మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ నివేదికలే చెప్తున్నాయి. ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11 సాయంత్రం వరకు మద్యం షాపులు మూతపడ్డాయి. ముందుచూపుతో మందు కొనుగోలు చేసిన అభ్యర్థులు.. రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల వేడి ప్రారంభమైనప్పటి నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు కిటకిటలాడుతుండగా, అభ్యర్థులు తమ గెలుపు కోసం గుట్టుచప్పుడు కాకుండా మద్యం పంపిణీ చేయడంతోనే విక్రయాలు భారీగా పెరిగాయి.
పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు శనివారం ఒకరోజే రికార్డు స్థాయిలో రూ.205 కోట్ల అమ్మకాలు జరిగాయి. 48 గంటలకు ముందు సోమవారం రోజు రూ.173 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగనట్టు తెలుస్తున్నది. గత నెల 29 నుంచి ఈ నెల 9 వరకు రికార్డు స్థాయిలో 10.21 లక్షల కేసుల విస్కీ, బ్రాందీ అమ్ముడుపోయింది. గత ఏడాది ఈ సీజన్లో ఆబ్కారీ శాఖ అమ్మింది కేవలం 7.69 లక్షల కేసులేనని టీఎస్‌బీసీఎల్ రికార్డులు చెప్తున్నాయి.
మరోవైపు బీర్ల విక్రయాలు గత ఏడాది 12 లక్షల కేసులపైగా ఉండగా, ఈసారి 12.1 లక్షల కేసులకు పడిపోయింది. వాస్తవానికి మునిసిపల్ ఎన్నికల ప్రభావం జనవరి నుంచే స్పష్టంగా కనిపిస్తున్నది. గత ఏడాది జనవరిలో రూ.2,984 కోట్ల అమ్మకాలు జరిగితే, ఈ ఏడాది జనవరిలో అవి రూ.3.325 కోట్లకు పెరిగాయి. అంటే ఆ ఒక నెలలోనే రూ.341కోట్ల కోట్ల వృద్ధి నమోదైంది. మద్యం విక్రయాల ధోరణిని పరిశీలిస్తే ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఎకువగా మద్యానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు ఎక్సైజ్ నివేదికలు చెప్తున్నాయి.