హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘటమైన కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక ఈ నెల 16న జరుగుతుంది. ఈ ప్రత్యేక సమావేశానికి మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ సగం మంది (కోరం) లేకపోతే ఎన్నికను వాయిదా వేస్తారు. అందుకే ఇప్పటికే పార్టీల వారీగా క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వార్డుల, డివిజన్ల అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక జరుగనున్నది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఉంటుంది.
ఎన్నికైన వార్డు సభ్యులు మాత్రమే మేయర్ లేదా చైర్పర్సన్ పదవులకు పోటీ చేయడానికి అర్హులు. రిజర్వేషన్లు అమల్లో ఉన్నచోట ఆయా క్యాటగిరీల వ్యక్తులు మాత్రమే పోటీచేయాలి. ఇది రహస్య ఓటింగ్ కాదు. చేతులెత్తడం ద్వారా ఎన్నిక జరుగుతుంది. మొదట మేయర్ లేదా చైర్పర్సన్ ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాతే డిప్యూటీ మేయర్ లేదా వైస్ చైర్పర్సన్ ఎన్నిక చేపడుతారు. ఒకే అభ్యర్థి ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకటి కంటే ఎకువ మంది ఉంటే ఎకువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఓట్లు సమానంగా వస్తే లాటరీ (డ్రా) ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
రాజకీయ పార్టీలు తమ సభ్యులకు నిర్దిష్ట అభ్యర్థికే ఓటు వేయాలని విప్ జారీ చేస్తాయి. ఒకవేళ ఎవరైనా సభ్యుడు పార్టీ విప్ పాటించకుండా వేరే వారికి ఓటు వేస్తే, వారి సభ్యత్వం రద్దవుతుంది. విప్ ఉల్లంఘనపై పార్టీలు మూడు రోజుల్లో కలెక్టర్కు ఫిర్యాదు చేయాలి. కలెక్టర్ వారం రోజుల్లో సదరు సభ్యుడి వివరణ కోరుతారు. సరైన సమాధానం లేకపోతే సభ్యత్వం రద్దు చేస్తారు. కానీ వారు వేసిన ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుంది. స్వతంత్ర అభ్యర్థులకు విప్ జారీ చేసే అవకాశం ఉండదు. ఈ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఓటు వేసే కీలక అధికారం కలిగి ఉంటారు. వీరు తమ ఓటు హకు వినియోగించుకోవడానికి ఈ నెల 14వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలి.