మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 12:12:02

ఎస్సీ కార్పొరేష‌న్ ద్వారా 18 మంది మ‌హిళ‌ల‌కు 'షీ క్యాబ్స్‌'

ఎస్సీ కార్పొరేష‌న్ ద్వారా 18 మంది మ‌హిళ‌ల‌కు 'షీ క్యాబ్స్‌'

సంగారెడ్డి : అతివలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. పురుషులకు సమానంగా తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో తమ ప్రతిభ కనబర్చుతున్న మహిళామణులు డ్రైవింగ్‌లోనూ రాణిస్తున్నారు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దూసుకుపోతున్నారు. మహిళా ప్రగతితోనే రాష్ట్ర, దేశ ప్రగతి సాధ్యమవుతుందనే సంకల్పంతో సీంఎం కేసీఆర్‌ ప్రయోగాత్మకంగా సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ‘షీ క్యాబ్స్‌' పథకం అమలుకు శ్రీకారం చుట్టారు.   ఇందులో భాగంగా 18 మంది మహిళలు దరఖాస్తు  చేసుకుని డ్రైవింగ్‌ శిక్షణ పూర్తి చేసుకున్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతమైంది.  


ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఎస్సీ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో 18 మంది మ‌హిళ‌ల‌కు షీ క్యాబ్స్‌ను రాష్ర్ట ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు క్రాంతికిర‌ణ్‌, మాణిక్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డితో పాటు ప‌లువురు పాల్గొన్నారు. రాష్ర్టంలోనే తొలిసారిగా షీ క్యాబ్స్ ప‌థ‌కాన్ని పైల‌ట్ ప్రాజెక్టుగా సంగారెడ్డిలో ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌ని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. మ‌హిళ‌లు విజ‌య‌వంతంగా కార్లు న‌డిపి ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిల‌వాల‌న్నారు. షీ క్యాబ్స్ ప‌థ‌కాన్ని రాష్ర్ట వ్యాప్తంగా అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎస్సీ ల‌బ్దిదారుల‌కు ప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని మంత్రి తెలిపారు. 

18 మందికి సబ్సిడీపై కార్లను ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.1,32,30,000లను ప్రభుత్వం ఖర్చు చేసింది. కార్లలో జీపీఎస్‌ వసతి, ఆఫ్రాన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను అందుబాటులో ఉంచడంతో పాటు మహిళలకు రక్షణగా పెప్పర్‌ స్ప్రేలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు.  18-45 ఏండ్ల వయసున్న మహిళలను ఈ ప‌థ‌కానికి ఎంపిక చేశారు.