హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబుకు నిజమైన వారసుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అని వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. ‘కాంగ్రెస్ ఇచ్చేది ఉచిత కరెంటు కాదు.. ఉత్త కరెంటే’ అని శాసనమండలి, శాసనసభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్ల కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగున్నదా? 9 ఏండ్ల కేసీఆర్ పాలనలో కరెంట్ బాగున్నదా? అని చూసి ఓటువేయాలని ప్రజలను అడుగుదామని రేవంత్‌కు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అన్ని ప్రాంతాలవాళ్లు అడుగుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ పోటీ చేయడం వల్ల ఆ నియోజకవర్గం, జిల్లా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో అందరూ కోరుతున్నారని అన్నారు. కేసీఆర్ గతంలో సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్‌నగర్, గజ్వేల్ నుంచి గెలిచారని, ఆయనకు ఎన్నికల్లో పోటీ ఇవ్వగలిగేవారు ఉన్నారా? ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణభవన్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు బీఆర్ఎస్లో చేరారు.
సీఎం కేసీఆర్ పాలనలో నిండైన కరెంట్, మెండైన పంటలు పండుతున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘బీఆర్ఎస్ 9 ఏండ్ల పాలనలో ఏనాడైనా కరెంట్ వస్తలేదని ఎవరైనా అసెంబ్లీలో మాట్లాడారా? గతంలో కాంగ్రెస్‌వాళ్లు అధికారంలో ఉంటే తెలుగుదేశంవాళ్లు, తెలుగుదేశంవాళ్లు అధికారంలో ఉంటే కాంగ్రెస్‌వాళ్లు కాలిపోయిన మోటర్లు, కందెనలు, కాగడాలు పట్టుకొని అసెంబ్లీకి వచ్చేవారు. బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా వాటిని పట్టుకొచ్చారా? నేడు ఆ పరిస్థితులు రాష్ట్రంలో లేవు. అందుకే నేడు కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలెక అయింది. మూడుగంటలు కరెంటు చాలని దొరికిపోయి.. ఇప్పుడు నాలుక కరుచుకొని బుకాయించడానికి అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. కరెంట్ మీద ఎంత చర్చ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి అంత మేలు’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. ‘వ్యవసాయం దండుగ అని చంద్రబాబు అంటే, వ్యవసాయానికి మూడు గంటలు చాలు అని రేవంత్ అంటున్నారు. నాడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉండి ఉచిత కరెంట్ కాస్తా ఉత్త కరెంట్ అయ్యింది, పగటి వేళల్లో కరెంటే ఉండటం లేదని మాట్లాడారు. పార్టీ మారగానే మాట మార్చారు. కాంగ్రెస్ పాలన అంటే కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. గీతారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు జహీరాబాద్‌లో నాలుగైదు గంటలు కూడా కరెంటు రాని పరిస్థితి ఉండేది’ అని హరీశ్‌రావు అన్నారు.
పొన్నాల గ్రామంలోనే
కాంగ్రెస్ పాలనలో విద్యుత్తుశాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్యయ్య స్వగ్రామం ఖిలాషాపూర్‌లో కరెంట్ లేక పంటలు ఎండిపోయాయని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. నాడు ఆ గ్రామానికి ఏడెనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం వెళ్లి చూస్తే 3 గంటలు కూడా కరెంట్ వస్తలేదని, గంట గంటకు ట్రిప్ అవుతుందని రైతులు గగ్గోలు పెట్టారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు నేడు తెలంగాణలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. నిండైన కరెంట్‌తో మెండైన పంటలు పండే బీఆర్ఎస్ పాలన కావాలని ప్రజలందరూ కోరుకొంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? అని నిలదీశారు. కర్ణాటకలో 6-7 గంటల కరెంట్ కూడా రావడం లేదని తెలిపారు.
తెలంగాణను ముంచే పోలవరానికి
ముగ్గు పోసిందే కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ తెలంగాణ వ్యతిరేకిగానే ఉన్నదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ‘నాడు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్. 1969లో తెలంగాణ ఉద్యమం చేస్తే 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్. 2004లో గులాబీ జెండాతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇవ్వకుండా మాటతప్పింది కాంగ్రెస్. పోతిరెడ్డిపాడుకు పొక పెట్టి కృష్ణా జలాలను ఆంధ్రాకు ఆక్రమంగా తీసుకువెళ్లింది కాంగ్రెస్. పులిచింతలకు పురుడు పోసింది, పోలవరానికి ముగ్గు పోసింది కాంగ్రెస్. తెలంగాణకు నీళ్లు లేకుండా చేసింది కాంగ్రెస్. నల్లగొండ ఫ్లోరైడ్ భూతానికి కారణం కాంగ్రెస్’ అని ధ్వజమెత్తారు. ఎవరెన్ని తిట్టినా పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణమనే పవిత్ర యజ్ఞం చేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, పంచాయతీరాజ్, వ్యవసాయం, దళిత, గిరిజనాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరిస్తది అనేవిధంగా అభివృద్ధి చేశారని కొనియాడారు. నాడు లోక కల్యాణం కోసం రుషులు యజ్ఞాలు చేస్తే, రాక్షసులు భగ్నం చేయడానికి ప్రయత్నించినట్టు నేడు సీఎం కేసీఆర్ ఒక రుషిలా రాష్ట్రాన్ని బాగు చేయడానికి కష్టపడుతుంటే ప్రతిపక్షాలు భంగం కలిగించటానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఖ్యాతిని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌కు పోటీ ఉంటదా?
తెలంగాణలో కేసీఆర్ ఎకడ పోటీ చేసినా కండ్లకద్దుకొని గెలిపిచ్చారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.‘సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్‌నగర్, గజ్వేల్.. ఇలా కేసీఆర్ ఎక్కడ పోటీచేసినా ప్రజలు అద్భుతంగా మద్దతిచ్చి గెలిపించారు. కేసీఆర్ మా దగ్గర పోటీచేస్తే బాగుండు.. మా ఊరు, మా నియోజకవర్గం, మా జిల్లా బాగుపడుతది అని అన్ని ప్రాంతాలవాళ్లు ఇప్పుడు కోరుకొంటున్నారు. 2014 ముందు తెలంగాణ ఎలా ఉండె? ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలి. బిందెలు మోసిన రోజులు, విసన కర్రలు ఊపుకొన్న రోజులు ఇప్పుడున్నాయా? అని ఆలోచిస్తే కేసీఆర్ చేసిందేమిటో అర్థమైతది. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడేవారిని నమ్మితే మోసపోతం’ అని ప్రజలకు సూచించారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ దుకా ణం ఖాళీ అవుతుందని, గులాబీ జెం డా మరోసారి ఎగురబోతున్నదని స్ప ష్టంచేశారు. సంగమేశ్వర ప్రాజెక్టు ద్వా రా లక్ష ఎకరాలకు రెండుమూడేండ్లలో సాగునీరు అందిస్తామని తెలిపారు.