హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ లీడర్ కాదు.. జస్ట్ రీడర్ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్యాచ్ రాసిచ్చిన స్క్రిప్ట్‌నే ఆయన చదువుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు అనగానే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నేతలు వచ్చి వాలుతున్నారని, వాళ్లు తెలంగాణకు బంధువులు కాదు.. ప్రజలను పీడించే రాబంధులని విమర్శించారు. తెలంగాణలో గెలిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాహుల్‌గాంధీ ఏ హోదాలో హామీ ఇస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనా? రాహులా? ప్రియాంకనా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా అభివృద్ధి కండ్లకు కడుతున్నదని, ఏ గుండె చప్పుడు విన్నా జై కేసీఆర్, జై తెలంగాణ అంటున్నదని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఆంక్షలెందుకు?
ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటున్నామని రాహుల్‌గాంధీ అబద్ధాలు చెప్తున్నారని, అక్కడ ఎకరాకు 15 క్వింటాళ్లు మాత్రమే కొంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో మాదిరిగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా కల్లాల దగ్గరే పంట మొత్తం కొంటున్నారని వివరించారు. రైతు రుణమాఫీ చేయలేదంటున్న రాహుల్‌గాంధీ దీనిపై ఒకసారి రైతులను అడగాలని సూచించారు.
బ్రిటీషోళ్లు గొప్పోళ్లా?
తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే అర్హత కాంగ్రెస్‌కు లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని టీఆర్ఎస్తో పొత్తు పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే మాట తప్పిందని విమర్శించారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు టీఆర్ఎస్ను బలహీనపరిచి తెలంగాణ వాదమే లేదని బుకాయించేందుకు కుట్రలు చేయలేదా? అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ కేంద్రం నుంచి ఎందుకు వైదొలిగారు? కరీంనగర్ ఉప ఎన్నికలో ప్రజలు తెలంగాణ సెంటిమెంట్‌ను కాంగ్రెస్‌కు రుచిచూపించలేదా?’ అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్‌తోసహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటారని చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి ఆమరణ నిరాహారదీక్ష చేస్తే కాంగ్రెస్‌కు మరో మార్గం లేక తెలంగాణ ప్రకటన చేసిందని వివరించారు. రాహుల్ తీరు చూస్తుంటే స్వాతంత్య్రం కోసం ఉద్యమాలు చేసినోళ్లదేమీ లేదు కానీ ఇచ్చిన బ్రిటీషోళ్లు గొప్పోళ్లు అన్నట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
దునియా మొత్తం కీర్తిస్తున్నది
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ తెలంగాణ ద్రోహులేనని హరీశ్‌రావు మండిపడ్డారు. హుజూరాబాద్‌లో బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా? లేదా? అని ప్రశ్నించారు. ‘బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదు. తెలంగాణ ప్రజలకు ఏ టీం. మాకు తెలంగాణ ప్రజలే హైకమాండ్. మా ఎజెండా తెలంగాణ అభివృద్ధి. మా విధానం సంక్షేమం. దేశంలో సంక్షేమ పాలనకు కేరాఫ్ అంటే తెలంగాణలో కేసీఆర్ సరార్ అని దునియా మొత్తం కీర్తిస్తున్నది’ అని పేర్కొన్నారు.
వ్యవసాయానికి కరెంటుపై కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే
వ్యవసాయానికి కరెంటుపై కాంగ్రెస్, బీజేపీ ఒకేవిధంగా వ్యవహరిస్తున్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. కర్ణాటకలో రైతులకు 7 గంటల కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ 5 గంటలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. అకడి రైతులు కరెంటు కోసం కన్నీరు మున్నీరు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వీళ్లకు అధికారం అప్పగిస్తే రైతులను బతుకనిస్తారా? అని ప్రశ్నించారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ చెప్తున్నారని, ప్రాణం పోయినా మీటర్లు పెట్టనని సీఎం కేసీఆర్ ఆయన మొఖం మీదే చెప్పారని తెలిపారు. దీంతో తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని, రూ.25 వేల కోట్లు రాకుండా ఆపిందని విమర్శించారు. రైతుల కోసం పథకాలు పెట్టినా, కేంద్రంతో కొట్లాటకు దిగినా, ఒక కేసీఆర్‌కే సాధ్యమైందని చెప్పారు.
సమక్క-సారక్క అప్పుడు గుర్తురాలేదా?
అధికారంలో ఉన్నప్పుడు సమ్మక్క-సారక్క జాతరను పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తామని చెప్పడం విడ్డూరమని హరీశ్‌రావు మండిపడ్డారు. రాహుల్, ప్రియాంక రామప్పకు వెళ్లి దేవుడిని దర్శించుకోవడం మంచిదేనని, అంత గొప్ప గుడికి ఏం చేశామన్న పాపభీతి వారిలో కలిగిందా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తెలంగాణను హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దారని వివరించారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో ఇలాంటి సేవలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.