హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు చురకలంటించారు. టీఆర్ఎస్ పార్టీ రాతిగోడ లాంటింది.. ఆ పార్టీని ఎవరూ ఏం చేయలేరని తేల్చిచెప్పారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం తగదు అని తీన్మార్ మల్లన్నను మంత్రి హెచ్చరించారు. కుటుంబ సభ్యులను కించపరిచేలా వ్యాఖ్యానించడం సరైనది కాదన్నారు. దుష్ప్రచారం చేయడం బీజేపీకి బాగా తెలిసిన విద్య. ఇటువంటి చర్యలతో టీఆర్ఎస్ పార్టీని అడ్డుకోలేరు. టీఆర్ఎస్ రాతిగోడ తరహాలో బద్దలు కొట్టలేనంత దృఢంగా ఉందని హరీశ్‌రావు తన ట్వీట్లో పేర్కొన్నారు.
Dragging families, finding ways to humiliate them and now oiling their social media machinery to spread malicious information is a well known strategy of the BJP.
— Harish Rao Thanneeru (@trsharish) December 25, 2021
If they think they can restrain us, I want to remind them that we are a rock solid wall which can never be broken. https://t.co/y0LsR13X24
ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ నాయకులు నీచపు పనులకూ వెనుకాడటం లేదు. కుటుంబాన్ని, పిల్లలను దూషిస్తూ జనాలతో ఛీ కొట్టించుకొంటున్నారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతూ మరింత దిగజారుతున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ చానల్లో మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అభ్యంతకరంగా పోల్ పెట్టారు.
పోల్ ఇదీ..
‘అభివృద్ధి ఎక్కడ జరిగింది..?
భద్రాచలం గుడిలోనా..?
హిమాన్షు శరీరంలోనా..?’
దీన్ని చూసిన ఓ నెటిజన్ ‘ఫ్యామిలీ మెంబర్ మీద ఇంత దిగజారి పోల్స్ పెడుతుండు ఈ మల్లిగాడు. మీరు చూస్తూ కూర్చోండి అన్నా” అంటూ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు ట్యాగ్ చేశారు. తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్వీట్ చేశారు. ‘శ్రీ జేపీ నడ్డా జీ.. తెలంగాణలోని బీజేపీ నేతలకు మీరు నేర్పుతున్నది ఇదేనా? బీజేపీ బాకాల నీచమైన రాజకీయ వ్యాఖ్యాల్లోకి నా కుమారుడిని లాగటం, బాడీ షేమింగ్ చేయటం సంస్కారమా? అమిత్‌షా విషయంలోనూ మేము ఇలాగే చేయొచ్చా? మోదీ కుటుంబంపై ఇలాగే మాట్లాడొచ్చా? దాని గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదా?’ అని ట్వీట్లో నిప్పులు చెరిగారు.
‘దురదృష్టవశాత్తు వాక్/భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఇతరులను తిట్టడానికి, వారిపై బురద జల్లటానికి ఒక హక్కుగా మారిపోయింది. సోషల్ మీడియా జర్నలిజం ముసుగులో విచ్చలవిడిగా అసత్యాలు, వదంతులు, చెత్తను ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు సంఘ విద్రోహ చర్యలకు అడ్డాగా మారాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా కొందరు కించిత్ సిగ్గు లేకుండా, ఎలాంటి రుజువు లేకుండా దుర్మార్గమైన, నిరాధార ఆరోపణలు చేస్తుంటే.. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది.. ప్రజాజీవితం లో ఉండటానికి అర్థం ఉన్నదా? అని. జర్నలిజం ముసుగులో 24 గంటలు చెత్త ప్రసారం చేసే యూట్యూబ్ చానళ్లు ఆ చెత్తలోకి పిల్లలను లాగుతున్నాయి. ఈ థర్డ్ రేట్ నాయకులు, బీజేపీ బాకాలు నా పిల్లలపై నేరపూరిత వ్యాఖ్యలు చేయకుండా దయచేసి అడ్డుకోండి. లేదంటే మేం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మేము కూడా ఇదే స్థాయిలో ప్రతిస్పందించాల్సి వస్తుంది. ఆ తర్వాత మాపై నింద మోపొద్దు.’ అని వరుస ట్వీట్లు చేశారు