Minister Harish Rao | గర్భిణులకు ఉత్త సేవలు అందించడంతో పాటు ఏదైనా సమస్య ఎదురైన సమయంలో సురక్షితంగా అబార్షన్లు చేయడంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. గర్భంలో పిండం సరిగా ఎదగకపోవడం, కీలక అవయవాలు లోపించడం, పుట్టిన తర్వాత జీవించలేని తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటి సందర్భాల్లో అబార్షన్ చేయాల్సి వస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ‘మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) అమెండ్మెంట్ యాక్ట్ – 2021’లో ‘కాంప్రహెన్సివ్ అబార్షన్ కేర్’ (సీఏసీ)కు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించింది.
గర్భస్రావం ఎలాంటి సందర్భంలో చేయాలి? ఎవరు చేయాలి? ఏయే వసతులు ఉండాలి? అనంతరం ఎలాంటి సేవలు అందించాలనే అంశాలను సూచించింది. సీఏసీ అమలు తీరుపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖకు చెందిన ప్రత్యేక బృందం రాష్ట్రంలోని నిలోఫర్ హాస్పిటల్, కింగ్‌కోఠి హాస్పిటల్, షాలిని ప్రైవేట్ హాస్పిటల్‌ను సందర్శించి.. వసతులపై ఆరా తీసింది. రాష్ట్రాల పనితీరు ఆధారంగా ర్యాకులు ఇచ్చింది. ఇందులో తెలంగాణకు మొదటి ర్యాంకు దక్కింది.
పనితీరు, సేవలు, శిక్షణ, నివేదికల తయారీలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. కేంద్ర వైద్యారోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణకు ‘ఎక్సలెన్స్ అవార్డు’ను అందజేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అశోక్ బాబు, మాజీ అడిషనల్ సెక్రటరీ మనోహర్ అగ్నానీ చేతుల మీదుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మజ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ సిబ్బందిని మంత్రి హరీశ్‌రావు అభినందించారు.