‘వైట్‌కాలర్ నేరగాళ్లని దేశం దాటించిన బీజేపీకి ఓటెయ్యాల్నా? లేక మీ పిల్లలు డాక్టర్లు కావాలన్న కలలను నిజం చేస్తూ వైట్‌కోట్ రివల్యూషన్ సృష్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాల్నా? ఆలోచించాలి’
– మంత్రి హరీశ్‌రావు
నాగర్‌కర్నూల్/రంగారెడ్డి, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ తొమ్మిందేండ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూ, విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కులను కాలరాస్తూ ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. తమను గెలిపిస్తే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోదీ.. ఈ ఐదేండ్లు ఏమి చేశారని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న గిరిజన వర్సిటినీ మంజూరు చేయకుండా తొమ్మిదేండ్లు జాప్యం చేశారని మండిపడ్డారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో రూ.17.5 కోట్లతో వంద పడకల దవాఖాన నిర్మాణానికి భూమిపూజ, రూ.45 కోట్లతో మిషన్ భగీరథ, రూ.10 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సెగ్రిగేషన్ షెడ్‌ను ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లా మ మహేశ్వరం నియోజకవర్గం మీర్ఖాన్పేటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఆయా సభల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ర్టానికి వచ్చిన ప్రధాని మోదీ నాలుగు చిలుక పలుకులు పలికారని ఎద్దేవా చేశారు. విభజన చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీని ఇవ్వకుండా తొమ్మిదేండ్లుగా జాప్యం చేశారని, ఇప్పుడు చెవిలో పూలు పెడుతున్నారని విమర్శించారు. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, వరంగల్‌లో కోచ్‌ఫ్యాక్టరీ ఎప్పుడు పెడుతరో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఇంకా మోసం చేయాలని చూస్తున్నదని, ఆ పార్టీకి ఓటేస్తే అది ఖరాబైపోతుందని పేర్కొన్నారు.
నేరగాళ్లను దేశం దాటించిన మోదీ
కృష్ణా జలాల పంపకాలపై ట్రిబ్యునల్ వేయకుండా తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీళ్లను బీజేపీ ప్రభుత్వం అడ్డుకున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లధనం బయటకు తెస్తామని, ఒక్కో అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని మాయమాటలు చెప్పిన మోదీ చివరకు నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా లాంటి వైట్‌కాలర్ నేరగాళ్లను సేఫ్‌గా దేశం దాటించారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరుచేస్తే, అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు
కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే రాష్ట్రం చీకటి మయం అవుతుందని, రైతులకు కరెంటు కష్టాలు, ఎరువుల కోసం తిప్పలు తప్పవని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. రైతుబంధు, రైతుబీమా, గోదాముల నిర్మాణం, ధాన్యం కొనుగోళ్లు లాంటివి అమలవుతాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో విడతలవారీగా కరెంటు ఇచ్చేవారని, మోటర్లు కాలిపోయేవని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ హయాంలో ఒక్క మోటారు, ఒక్క ట్రాన్స్ఫార్మరైనా కాలుతున్నదా? రైతులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఉదయం పూట 3 గంటలే కరెంటు ఇస్తున్నారని తెలిపారు. 3 గంటల కరెంట్ కావాలా? మూడు పంటలు పండించే ప్రభుత్వం కావాలా? ఆలోచించాలని కోరారు. నీళ్లు, కరెంటు, ఆసరా పింఛన్లు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవుల కోసం కొట్టుకుంటున్నారని, ఎకరం భూమికి, రూ.పది కోట్లకు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఎద్దేవాచేశారు. వారిని ఎన్నుకుంటే టిక్కెట్లతోపాటు తెలంగాణనూ అమ్ముకుంటారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు క్లారిటీతో ఉన్నారని, కాంగ్రెస్ ఎన్ని తీర్మానాలు చేసినా ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే కోరుకుంటున్నారని చెప్పారు. విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి పాల్గొన్నారు.