Minister Harish Rao | సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టే లేకుంటే.. ఇన్ని లక్షల ఎకరాలు ఎలా పారేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ ఎన్నికలు వచ్చాయని.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్పై నిలాపనిందలు వేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ లేకుంటే రాష్ట్రం వచ్చేది కాదని, సిద్దిపేట జిల్లా ఏర్పాటయ్యేది కాదన్నారు. అర్బన్ మండలం సిద్దిపేటకు హైటెక్ సిటీలా అయ్యిందని, అభివృద్ధిలో మండలం దూసుకుపోతుందన్నారు.
మిట్టపల్లి నుంచి సిద్దిపేట వరకు ఫోర్లైన్తో పాటు రంగధాంపల్లి వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు రూ.30కోట్ల విలువైన వడ్లు పండితే.. నేడు రూ.300కోట్ల విలువైన వడ్లు పండుతున్నాయన్నారు. రాష్ట్రంలో రూ.27వేల కోట్ల వడ్లు పండుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఆకలి చావులు, అంబలి కేంద్రాలు లేవన్నారు. కేసీఆర్ రైతును బలోపేతం చేశారని, దాంతో భూమి విలువ పెరిగిందన్నారు. నాటి కాంగ్రెస్ పార్టీకి నేటి బీఆర్ఎస్ పార్టీకి పొంతన లేదన్నారు. మన అభివృద్ధి తెరిచిన పుస్తకంలా ఉంది, మన పథకాలు అందని ఇల్లు లేదన్నారు. కల్యాణ లక్ష్మి పథకం రాక ముందు బాల్యవివాహాలు జరిగేవని, తొమ్మిదేళ్ల బీజేపి ప్రభుత్వంలో ఏ ఒక్క మంచి పని చేయలేదన్నారు.
ధరలు పెంచడం, అమ్మడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. బీజేపీవీ అన్నీ పడగొట్టే పనులు అయితే.. కేసీఆర్‌వి నిలబెట్టే పనులు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూలగొడుతా, కాలవేడతా అంటున్నారని, ఎమ్మెల్యేను కొనడం, ప్రభుత్వాలను పడగొట్టడం.. ఈడీలను పంపడం తప్ప ఏం లేదన్నారు. బండి సంజయ్ మాటలు బూతులు తప్ప రైతులపై ప్రేమ లేదన్నారు. బీజేపీవి పేదలకు వచ్చే పథకాల్లో కోతలు విధిస్తుందని, బీజేపీ చెప్పేటివి అన్నీ అబద్ధాలు తప్ప ఏం లేదన్నారు. బీజేపీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పి డీజిల్, పెట్రోల్ ధరలు రెట్టింపు చేసిందని విమర్శించారు. నా చివరి శ్వాస వరకు సేవ చేస్తానని, నా జీవితం సిద్దిపేట ప్రజలకే అంకితమన్నారు.