హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): వర్షా లు, వరదల నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నియంత్రణ, చికిత్సపై కార్యాచరణ రూపొందించాలని అన్నారు. రాబోయే నెల రోజులు అత్యంత కీలకమని చెప్పారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీ నుంచి సీజనల్ వ్యాధులు, బూస్టర్ డోస్, సీ-సెక్షన్లు, ఎన్సీడీ స్క్రీనింగ్ తదితర అంశాలపై జిల్లాల వైద్యాధికారులతో మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకోకుండా, ప్రభుత్వ దవాఖానలను సద్వినియోగం చేసుకొనేలా చూడాలని సూచించారు. మున్సిపల్, పంచాయతీ శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పారిశుద్ధ్యం పట్ల అవగాహన పెంచాలని చెప్పారు. ప్రతి పీహెచ్సీలో కుక, పాముకాటు మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. సబ్ సెంటర్ల వారీగా జరుగుతున్న ఎన్సీడీ స్రీనింగ్ త్వరగా పూర్తి కావాలని ఆదేశించిన మంత్రి.. స్క్రీనింగ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలను అభినందించారు. వర్షాలు, వరదల సమయంలో జిల్లా వైద్యాధికారులు సమన్వయంతో పని చేశారని, స్టాఫ్ నర్సులు, ఆశాలు, ఇతర సిబ్బంది అందరూ మంచి సేవలు అందించారని ప్రశంసించారు.
బూస్టర్ డోస్ వేగం పెరగాలి
పలు రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ పంపిణీ వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి వంటి జనసాంద్రత అధికంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని సూచించారు. మరో పది రోజుల్లో వాక్సినేషన్ వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని డీపీహెచ్ శ్రీనివాసరావును ఆదేశించారు. అన్ని పీహెచ్‌సీల్లో బూస్టర్ డోస్ అందుబాటులో ఉన్నదని, ఇంటర్ మొదలు అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని డీఎంహెచ్వోలను ఆదేశించారు. 100 మంది కంటే ఎకువ మంది లబ్ధిదారులు ఉంటే 040-24651119 నంబర్ ద్వారా సంప్రదిస్తే వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సీ- సెక్షన్లలో ఐదు జిల్లాలకు అభినందన
సీ-సెక్షన్లలలో గణనీయ మార్పు వచ్చిందని చెప్పిన మంత్రి.. తక్కువగా సీ సెక్షన్లు నమోదైన నారాయణపేట, కుమ్రం భీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలను అభినందించారు. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాలలో సీ-సెక్షన్లు బాగా తగ్గించి, సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని అన్నారు. ఏజెన్సీ చెకప్‌లలో జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, జనగామ, కుమ్రం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాలు మంచి పనితీరు కనబర్చాయని చెప్పారు. సూర్యాపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వికారాబాద్‌లో పనితీరు మెరుగుపడాలని సూచించారు.
దేశానికే రోల్‌మాడల్ ‘టీ డీ’
తెలంగాణ డయాగ్నస్టిక్స్ (టీ డీ) దేశానికే రోల్‌మాడల్‌గా నిలిచాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. 24 గంటల్లో పరీక్ష ఫలితాలు వచ్చేలా చేయాలని, బాధితుడు మరుసటి రోజు వాటిని వైద్యులకు చూపించుకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దవాఖానల్లో ఉండే టీడీల బాధ్యత ఆయా సూపరింటెండెంట్లు తీసుకోవాలని చెప్పారు. ఇందులో మంచి పనితీరు కనబర్చిన మెదక్ జిల్లాను అభినందించారు. పీహెచ్‌సీల మరమ్మతులు, కొత్త భవనం అవసరం ఉన్న వివరాలను టీఎస్ఎంఎస్ఐడీసీ ఈఈ, డీఎంహెచ్వోలు మరోసారి సమీక్షించి శుక్రవారంలోగా తుది ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్జెండర్లకు అండగా ప్రభుత్వం
సమస్యల పరిష్కారానికి మంత్రి హరీశ్ హామీ
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్జెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, సమస్యలను పరిషరించేందుకు కృషి చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వైద్యం, ఉపాధి, ఇతర అవకాశాల్లో అందరికీ సమాన హకులు ఉంటాయని, వాటికి ట్రాన్స్జెండర్లు అన్నివిధాలా అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ, మైనార్టీల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్వర్యంలో గురువారం పలువురు ట్రాన్స్జెండర్లు మంత్రి హరీశ్‌రావును కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడంతోపాటు తెలంగాణలోని ఆయా వర్గాల ప్రతినిధుల అభిప్రాయాలతో సమగ్ర నివేదికను అందజేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్‌ను ఆదేశించారు. ఆ నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించి, మంత్రి మండలిలో చర్చిస్తామని చెప్పారు. ఆరోగ్యం, విద్య, ఉపాధి, ఇతర సంక్షేమ పథకాల్లో ట్రాన్స్జెండర్లకు ప్రయోజనం చేకూరేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.