ఇబ్రహీంపట్నం/అందోల్, అక్టోబర్ 27: కేసీఆర్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ అంటే నాటకమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ అంటేనే కుట్రలు, కుతంత్రాలు, మోసాలకు పుట్టినిల్లులాంటిదని మండిపడ్డారు. ఆ పార్టీ సోషల్‌మీడియాలో బోగస్ ప్రచారం చేస్తూ అధికారంలోకి రావటానికి కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. శుక్రవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ బీఎంఆర్ కన్వెన్షన్హాల్లో బీఆర్ఎస్ బూత్‌స్థాయి కన్వీనర్ల సమావేశానికి, సంగారెడ్డి జిల్లా పోతులబొగుడలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి పోటీ కానేకాదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చావునోట్లో తలపెట్టి, కేంద్రం మెడలు వచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన కేసీఆర్ ఎక్కడ? ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డి ఎక్కడ? అని అన్నారు. కేసీఆర్‌కు అభివృద్ధి ధ్యాస తప్ప వేరే ఆలోచనలు ఉండవని చెప్పారు. కేసీఆర్ ఆంటేనే అభివృద్ధి అని, కేసీఆర్ అంటేనే నమ్మకమని, కాంగ్రెస్ అంటే బూటకమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో నమ్మకద్రోహం చేసి అధికారంలోకి వచ్చిందని, ఆ రాష్ట్ర రైతులే స్వయంగా తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ బండారాన్ని బయటపెడుతున్నారని వివరించారు. కర్ణాటక డబ్బులు తెచ్చి తెలంగాణ ప్రజల ఓట్లు కొనాలని ప్రయత్నం చేస్తున్నదని, కానీ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు.
రైతులంటే కాంగ్రెస్‌కు పగ
కాంగ్రెస్ మొదట్నుంచీ రైతు వ్యతిరేక పార్టీ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సూపర్‌హిట్ అని, వీటిని బూత్‌స్థాయి కన్వీనర్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ‘కేసీఆర్ భరోసా’ ఇస్తున్న పథకాలపై ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదని, వీటిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మె ల్సీ గొరటి వెంకన్న, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి ఫారూఖ్‌హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.