గతుకుల మెదక్‌ను కేసీఆర్ బతుకుల మెదక్‌గా మార్చారు. మెదక్‌లో కాంగ్రెస్ గెలిస్తే కైలాసంలో పెద్ద పాము మింగినట్టే. డబ్బుల కట్టలు గెలవాలా? మెదక్ ఆత్మగౌరవం గెలవాలా? డబ్బు సంచులతో పెద్దపెద్ద కార్లలో వస్తున్నవారిని చూసి మోసపోవద్దు. సాదాసీదా మెదక్ ఆడ బిడ్డ పద్మక్కను గెలిపించాలి.
– మంత్రి హరీశ్‌రావు
మెదక్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ ఆరిపోయే దీపాలని, కాంగ్రెస్ అధికారంలో వస్తే రాష్ట్రం అథోగతి పాలవుతుందని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. గురువారం మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి రూ.180 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అంతకుముందు మెదక్‌లో రూ. 50 లక్షలతో నిర్మించిన సఖి కేంద్రాన్ని, రూ. 2.5 కోట్లతో నిర్మించిన జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం, రూ.70 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మెదక్ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ నేతలేమో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బీ టీం అంటారని, కాంగ్రెసోళ్లేమో బీజేపీకి బీ టీం అంటారని పేర్కొన్నారు. తామెవరికీ బీ టీం కాదని.. తాము తెలంగాణ ప్రజల టీం అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలే తమకు హైకమాండ్ అని తేల్చి చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే బట్టకాల్చి మీద వేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలంగాణను ఇస్తామని కామన్ మినిమమ్ ప్రోగ్రాం పెట్టింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేదని గుర్తు చేశారు. మెదక్‌లో మెడికల్ కాలేజీతోపాటు మరో 180 కోట్లతో దానికి అనుబంధంగా 450 పడకల దవాఖానను నిర్మిస్తామని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఇక హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఘణపురం ఆయకట్టు పెంచి కాల్వలకు మరమ్మతులు చేసిన తర్వాత మెదక్ జిల్లాలో రెండు పంటలు పండుతున్నాయని వివరించారు.
త్వరలో సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటిస్తారని, అది చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ కావడం ఖాయమని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. ఇందులో అన్ని వర్గాల సంక్షేమం ఉంటుందని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా చివరికు హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రైతులు, మహిళలకు ఎలా మేలు చేయాలా? అని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు.
పెద్దపెద్ద కార్లు వేసుకుని డబ్బుల సంచులతో హైదరాబాద్ నుంచి మెదక్‌కు గూండాల గ్యాంగ్ బయలుదేరిందని, వాటిని చూసి మోసపోవద్దని ప్రజలను హరీశ్‌రావు కోరారు. గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్టు ఒక ఆడ బిడ్డ మీద నోట్ల కట్టలతో దాడి చేయడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరారని ఆరోపించారు. మెదక్‌లో మన ఆడబిడ్డను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. పిలిస్తే పలికే మనిషి, మీ తోటి ఆడపడుచు, మీ ఇంట్లో అక్కగా, చెల్లిగా పనిచేసిన వ్యక్తి పద్మక్క మెదక్ జిల్లా సాధించిందని ప్రశ్నించారు. మెదక్‌కు ఘణపురం నీళ్లు తీసుకువచ్చిందని, మరెన్నో కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ మన పద్మక్క గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు గెలిసిండ్రంటే కైలాసంలో పెద్ద పాము మింగితే కింద పడ్డట్టు అవుతుందని హెచ్చరించారు. పద్మమ్మకు ఓటు వేసి గెలిపించి దీవించాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలను కోరారు.