Huzurabad | హుజూరాబాద్ : తెలంగాణ సొంతింటి పార్టీ టీఆర్ఎస్ అని, తెలంగాణ సాధన కోసం ప్రజలు తయారు చేసుకున్న ఆయుధం కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా సోమవారం ఉదయం పలువురు నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ రోజు ఢిల్లీలో మనల్ని హైదరాబాదీలని పిలువడానికి కారణం మన పాలన, మన కేసీఆర్ అని గర్వంగా చెప్పారు మంత్రి గంగుల కమలాకర్.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అద్భుతంగా అభివృద్ధి చెంతున్నా.. హుజూరాబాద్ మాత్రం అత్యంత వెనకబడి ఉన్నదని, దానికి కారణం ఎవరో కూడా స్థానికులకు బాగా తెలుసన్నారు. ఈటల రాజీనామా చేసిన తర్వాతే ఇక్కడ అభివృద్ధి ప్రారంభమైందని చెప్పారు. అది కూడా కుంటుపడకుండా ఉండాలంటే మన ఉద్యమాల బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజార్టీతో గెలువాలన్నారు.
పేదల భూముల్ని అక్రమంగా లాక్కొని, కోట్లకు అధిపతి అయిన వ్యక్తి కావాలో? మీ వెంట ఉంటూ, అభివృద్ధి కాంక్షించే పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని మంత్రి కోరారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షం గెలిస్తే ప్రతీ పనికి అడ్డుపడి అభివృద్ధిని సాగనివ్వరన్నారు. చెలుక వాగు బ్రిడ్జి, సత్సంగ్ రోడ్డు ఇంకా మిగతా అభివృద్ధి పనుల్ని ఆపుతాడని మంత్రి చెప్పారు. ప్రతీక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి అండగా ఉండే నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని మంత్రి గంగుల కొనియాడారు. పేదింటి బిడ్డ, ఉద్యమకారుడు నిరంతరం ప్రజల పక్షాన ఉండే గెల్లును గెలిపించి పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు అభివృద్ధికి వెచ్చించారని, తద్వారా కంపెనీలు వచ్చి మన హుజురాబాదీలకు ఉద్యోగాలు దొరుకుతాయన్నారు.
చాలా రాష్ట్రాలను, దేశాన్ని పాలిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ అందిస్తున్న పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు మంత్రి గంగుల. అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్న బీజేపీ మన రైతుల మోటార్ల దగ్గర మీటర్లు పెట్టాలని చూస్తొందన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజీల్, గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచి సామాన్యుల బతుకుల్ని భారంగా మార్చిందన్నారు. బీజేపీకి ఓటేస్తే ధరలు పెంచడానికి మద్దతిచ్చినట్టేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, గందే శ్రీనివాస్, ప్రతాప కృష్ణ, తాళ్లపల్లి శ్రీనివాస్, ఖాజీపేట శ్రీనివాస్, రాధస్వామి సత్సాంగ్ సభ్యులు మార్కండేయ, రవి స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.