కరీంనగర్ రూరల్: ఆగస్టు 22: రుణమాఫీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీతో సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని తేలిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. మంగళవారం కరీంనగర్లో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మండల సమావేశం తీర్మానం చేసింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజల మనస్సు చూరగొనేలా ప్రజాప్రతినిధులు పనిచేసి, వారి మన్ననలు పొందాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్లు మంజూరు చేసి, రైతులందరికీ రుణమాఫీ చేసిందని చెప్పారు. రైతుబీమా, రైతుబంధు పథకాలను అమలు చేసి రైతు సంక్షేమ ప్రభుత్వంగా నిలిచిందని కొనియాడారు.
సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని, మళ్లీ సీఎం కేసీఆర్‌కే అధికారం అప్పగించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ర్టాన్ని ఇతరులకు అప్పగించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ప్రజలకు వచ్చిందని అన్నారు. స్వరాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయంతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అనేక గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. దేశంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కరీంనగర్ చరిత్రలో 1956 నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రెండోసారి గెలిచిన దాఖలాలు లేవన్నారు. కరీంనగర్ ప్రజల ఆశీస్సులతో మున్సిపల్ కౌన్సిలర్‌గా, నగర కార్పొరేటర్‌గా గెలుపొంది, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు ఆయన పేర్కొన్నారు. తనకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు అని తెలిపారు.