Minister Gangula | నేటికి 62లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని.. జూన్ 10వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు సాయం, 24 గంటల కరెంటుతో దిగుబడి భారీగా పెరిగిందన్నారు. తొలిసారిగా 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 2022 జూన్ 10 నాటికన్నా 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు 9.50లక్షల మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకున్నారని, రూ.12,450 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.
తొలుత తెలంగాణవ్యాప్తంగా 7,192 ధాన్యం కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. 7,034 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గతంలో 4,135 కేంద్రాలు మాత్రమే ఉండేవని, ఇప్పటివరకు రూ.6కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. మిగతా డబ్బులను సైతం ఈ నెల 15లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. రెండో పంటను కొనుగోలు చేసి ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకున్నామన్న గంగుల.. ఈ నెల 16 వరకు కొనుగోలు కేంద్రాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ఆలస్యంగా ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుమతిని ఇస్తామని, కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు పూర్తయిన కేంద్రాల్లో కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వయంపాలనలో కరీంనగర్ గొప్ప నగరంగా అవతరించిందని, అభివృద్ధి మీ కళ్లకే కనిపిస్తుందన్నారు. గణేశ్‌నగర్ బైపాస్ రోడ్డును గత 50 సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోలేదని, ఇప్పుడు సుందరంగా తీర్చిదిద్దామన్నారు. సివిల్ ఇంజినీర్‌గా ఎమ్మెల్యేగా కరీంనగర్ ప్రజలకు గొప్ప నగరాన్ని అందించాలని కృషి చేస్తున్నానన్నారు. కరీంనగర్ బ్రహ్మోత్సవాలు, కళోత్సవాలు, చిత్రోత్సవాలకు వేదికగా మారిందన్నారు. సౌత్ ఇండియాలోనే తొలి కేబుల్ బ్రిడ్జిని ఈ నెల 21న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
ఈ కేబుల్ బ్రిడ్జి దుర్గం చెరువు కన్నా అడ్వాన్స్‌గా ఉంటుందని, కేబుల్ బ్రిడ్జిలో 10/30 అడుగుల స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయని చెప్పారు. అదేరోజు సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించుకుంటామన్నారు. ఊహకు అందని విధంగా మానేరు రివర్ ఫ్రంట్‌ను నిర్మిస్తున్నామని, ఆగస్టు 15న మొదటి దశ ఎంఆర్‌ఎఫ్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. అదేరోజు ప్రపంచంలోనే మూడవదైన ఫౌంటెన్లను ప్రారంభిస్తామన్నారు. రూ.72 కోట్లతో నిర్మించనున్న ఈ ఫౌంటెన్ టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమయ్యే దశలో ఉన్నాయన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి.. రాజకీయ విమర్శలను పట్టించుకోమన్నారు.