కరీంనగర్: మనం కాపాడే వనాలు భావితరాలకు గొప్ప ఆస్తిగా మిగిలిపోతాయని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula kamalakar) అన్నారు. ఆస్తులు ఇస్తే కరిగిపోతాయని చెప్పారు. వనాలను ఆస్తిగా భావించి భావితరాలకు అందించేందుకు ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh kumar) హరిత విప్లవాన్ని (Haritha Viplavam) తీసుకొచ్చారన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో (Green India Challenge) భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మొక్కలను నాటారని వెల్లడించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా కరీంనగర్లో (Karimnagar) చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. పద్మానగర్ బైపాస్ రోడ్డులోని రాశివనంలో మొక్కలు నాటారు.
అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో వనాలు లేక కరీంనగర్ కాంక్రీట్ జంగిల్‌గా మారిందన్నారు. కానీ సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు స్వయం పాలనలో కరీంనగర్లో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 9 నుంచి 10 లక్షల మొక్కలు నాటామని, మొత్తం 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్‌తో ఎంపీ సంతోష్ కుమార్ చిన్నారుల్లో కూడా స్ఫూర్తిని నింపుతున్నారని మంత్రి గంగుల అన్నారు. ఎంపీ సంతోష్ స్ఫూర్తితో ఎక్కడ ఖాళీ ప్రభుత్వ స్థలం కనిపించినా మొక్కలు నాటుతున్నామని.. వాటిని సంరక్షిస్తామని తెలిపారు. ఎల్ఎండీలోని (LMD) ఎస్ఆర్ఎస్పీ (SRSP) స్థలం ఆక్రమణలకు గురికాకుండా పెద్ద ఎత్తున మొక్కలు నాటామని చెప్పారు. ఇప్పటి వరకు నాటిన మొక్కలు వృక్షాలుగా మారాయని, అవి భావితరాలకు బంగారు భవిష్యత్తును ఇస్తాయని వెల్లడించారు.
మూడు మొక్కలతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇప్పుడు మహా ఉద్యమంగా మారిందని ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh kumar) అన్నారు. ఈ మహత్తరమైన కార్యక్రమం ఐదేండ్లు పూర్తిచేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిందని చెప్పారు. కరీంనగర్ రాశి వనంలో మొక్కను నాటడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ ఐదేండ్ల కాలంలో లక్షలాది మొక్కలను నాటి, వాటిని సంరక్షించామన్నారు. కరీంనగర్లో పచ్చని మొక్కలతో అలరారుతున్న రాశివనం అద్భుతంగా ఉందని, పిచ్చి మొక్కలతో ఉండాల్సిన ఈ ప్రాంతాన్ని పచ్చని మొక్కలతో తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలిపారు.