Huzurabad | హుజూరాబాద్ : గత పాలకులు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. కనీసం దళితవాడల అభివృద్ధిని సైతం విస్మరించారు. నేడు సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధును ప్రవేశపెట్టి ఆర్థిక, సామాజిక భద్రత పెంచారు. అంతేకాకుండా పలు సామాజిక వర్గాలకు సైతం ఆర్థిక భరోసా ఇచ్చారని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. శనివారం ఉదయం హుజురాబాద్ టౌన్‌లోని దళితవాడ, 12వ డివిజన్, బోర్నపల్లి, ఇందిరానగర్, బీసీ కాలనీల్లో మార్నింగ్ వాక్‌లో మాట్లాడారు.
ఇక్కడి మహిళలు పనికిపోకుండా తమకోసం ఎదురుచూసి, బ్రహ్మాండంగా స్వాగతం పలికి, కడుపునిండా దీవిస్తున్నారని, అంతకంటే మహాభాగ్యం ఇంకేం ఉంటుందని అన్నారు మంత్రి. ఇన్నేళ్లలో ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు తమను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని, కడుపునిండా భోజనం పెట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆరే అని, ఆయనవల్లే తమకు ధైర్యం వచ్చిందని స్థానిక మహిళలు మంత్రితో చెప్పారు.
తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలూ ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతోనే రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం నీళ్లు, పంటల దిగుబడులు, దళితబందు వంటి పథకాలు వచ్చాయని చెప్పారు మంత్రి గంగుల. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల రైతుల ఆత్మహత్యలు ఆగాయన్నారు. మహిళలే ప్రతీ ఓటరును పోలింగ్ బూత్ వరకూ తీసుకెళ్లి టీఆర్ఎస్కు ఓటు వేయించేలా కృషి చేయాలని కోరారు. ఇక్కడి మహిళలు చైతన్యమే గెల్లు శ్రీనివాస్ గెలుపునకు నిదర్శనమని అన్నారు.