కౌలాలంపూర్ : ఈ ఏడాది జూన్-జులైలో యూఎస్ఏ, కెనడా, మెక్సికో ఆతిథ్యమివ్వనున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇరాన్ ప్రాతినిథ్యంపై అనిశ్చితి కొనసాగుతున్నది. అమెరికా.. ఇజ్రాయెల్‌తో కలిసి తమ దేశంపై చేస్తున్న దాడికి నిరసనగా యూఎస్‌లో జరుగబోయే ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనబోదని ఆ దేశ క్రీడాశాఖ మంత్రి అహ్మద్ డోన్యమలి తెలిపిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య మాత్రం ఇరాన్ నుంచి అధికారికంగా తమకు అలాంటి ప్రతిపాదనేమీ రాలేదని, ఆ జట్టు వరల్డ్ కప్ ఆడుతుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ మేరకు కౌలాలంపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఏఎఫ్సీ ప్రధాన కార్యదర్శి విండ్సర్ జాన్ స్పందిస్తూ.. ‘వారు (ఇరాన్) మా సభ్యులు. ఆ దేశం ప్రపంచకప్ ఆడాలని మేం కోరుకుంటున్నాం. ఇది చాలా భావోద్వేగ సందర్భం. చాలామంది చాలా విషయాలు చెబుతున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిందైతే ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్యే’ అని చెప్పాడు.