ముంబై, మార్చి 16 : దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత మూడు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్లు దన్నుగా నిలిచాయి. ప్రారంభంలో 74 వేల పాయింట్ల దిగువకు పడిపోయిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు దేశీయ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడం సూచీలు ఒక్క శాతానికి పైగా పెరిగాయి. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 938.93 పాయింట్లు లేదా 1.26 శాతం బలపడి 75,502.85 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 257.70 పాయింట్లు లేదా 1.11 శాతం అందుకొని 23,408.80 వద్ద స్థిరపడింది.
సూచీల్లో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు 4.22 శాతం బలపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు ట్రెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎటర్నల్, బజాజ్‌ఫైనాన్స్, ఐటీసీ, టాటా స్టీల్, ఎస్బీఐ, బజాజ్‌ఫిన్‌సర్వ్, ఇండిగో, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, రిలయన్స్ షేర్లు ఒక్క శాతానికి పైగా బలపడ్డాయి. అలాగే ఏషియన్ పెయింట్స్, కొటక్ బ్యాంక్, ఎల్అండ్టీ, అదానీపోర్ట్స్, హెచ్‌యూఎల్, టైటాన్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. కానీ, బీఈఎల్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. వాహన, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతు వల్లనే సూచీలు తిరిగి కోలుకున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.