కార్పొరేషన్, మే 12: కాంగ్రెస్, బీజేపీ నేతలు మళ్లీ తప్పుడు ప్రచారంతో వస్తున్నారని, ప్రతిపక్షాలను నమ్మితే రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి పోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. లేకపోతే తెలంగాణ సంపద, నీళ్లు, కరెంటు దోచుకు పోతారని హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్ శివారులో మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించి, మాట్లాడారు. తెలంగాణ రాకముందు కరీంనగర్ ఎలా ఉండేదో స్వరాష్ట్రంలో ఎలా ఉన్నదో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందని, గడిచిన ఎనిమిదేండ్లలో నగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వందల కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కరీంనగరాన్ని రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాలు పూర్తయితే దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుతుందని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులకు స్థానం లేదన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్కు అండగా నిలిచి సీఎం మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్పర్సన్ విజయ, మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.