హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో ఎవరి బలం ఎంతో తేల్చుకొనేందుకు లోక్ సభను రద్దు చేయాలని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి తాము అసెంబ్లీని రద్దు చేయిస్తామని ప్రధాని మోదీకి, బీజేపీకి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. లోక్‌సభను రద్దు చేసే ధైర్యం బీజేపీకి ఉన్నదా? అని ప్రశ్నించారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబసభ్యులను ప్రజలు ఓట్లేసి గెలిపించారని, వాళ్లు నామినేట్ కాలేదనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించాలని హితవు పలికారు.
కేటీఆర్‌ను చూసి భయపడుతున్న బీజేపీ
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కే తారకరామారావుకు వచ్చిన ఆదరణను చూసి బీజేపీ నేతలకు భయం పట్టుకొన్నదని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. అక్కడికి అన్ని రాష్ట్రాల మంత్రులు వెళ్లినా కేటీఆర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారని, రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారని తెలిపారు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొట్టి అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. మోదీ రోజుకు పది డ్రెస్సులు మార్చుడు తప్ప.. ఎనిమిదేండ్లలో దేశానికి ఏమైనా మంచి చేశారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ పర్యటనలో మోదీ ఒక్కరిని కూడా పలకరించలేదని, బీజేపీ కార్పొరేటర్లు కూడా ఆయన తీరుకు బాధపడ్డారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. రేవంత్‌రెడ్డి రెడ్లకే పదవులు కావాలంటున్నారని, ఇతర వర్గాల నాయకులు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు.
కేంద్రంలో బీసీ శాఖ ఎందుకు లేదు?: గంగుల
కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిందని, వారందరూ ప్రజల చేత ఎన్నికయ్యారని బీజేపీ గుర్తు పెట్టుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నా, కేంద్రంలో ఎందుకు లేదని నిలదీశారు. బీసీ ప్రధానిగా ఉన్నా బీసీ శాఖనే ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసినా పట్టించుకోవటంలేదని మండిపడ్డారు. బీసీలను బీజేపీ ఓటు బ్యాంకుగానే చూస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ గురుకులాల సంఖ్యనుం 19 నుంచి 281కి పెంచామని తెలిపారు. రాష్టంలో బండి సంజయ్‌కి అధికారమిస్తే మసీదులు తవ్వుతారా? అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రశ్నించారు. బీజేపీ ముందు కర్ణాటకలో గెలవాలని సవాల్ చేశారు.
లోక్‌సభను రద్దు చేసే ధైర్యం బీజేపీకి ఉన్నదా? మేము సీఎం కేసీఆర్‌తో మాట్లాడి అసెంబ్లీని రద్దు చేయిస్తాం. ప్రజల్లో ఎవరి బలం ఎంతో తేల్చుకొందాం. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కే తారకరామారావుకు వచ్చిన ఆదరణ చూసి బీజేపీ నేతలకు భయం పట్టుకొన్నది. మోదీ రోజుకు పది డ్రెస్సులు మార్చుడు తప్ప.. ఎనిమిదేండ్లలో దేశానికి ఏమైనా మంచి చేశారా?
–మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దేశంలో ప్రతి రాష్ట్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నా, కేంద్రంలో ఎందుకు లేదు? బీసీ ప్రధానిగా ఉన్నా బీసీ శాఖనే ఏర్పాటు చేయలేదు. బీసీలను బీజేపీ ఓటు బ్యాంకుగానే చూస్తున్నది. రాష్టంలో బండి సంజయ్‌కి అధికారమిస్తే మసీదులు తవ్వుతారా? కేసీఆర్ కుటుంబసభ్యులను ప్రజలు ఓట్లేసి గెలిపించారు, వాళ్లు నామినేట్ కాలేదు.
–మంత్రి గంగుల కమలాకర్