కరీంనగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ధీమావ్యక్తంచేశారు. మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన కరీంనగర్ బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు మన బతుకులు ఎలా ఉండేవి, ఇప్పుడెలా ఉన్నాయో ఆలోచించాలని కోరారు.
తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు కావాలని అడిగితే.. వెకిలిగా నవ్వి రూపాయి ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రూ.వెయ్యి కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తున్నానని వెల్లడించారు. ఢిల్లీ పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ ఆగమవుతుందని హెచ్చరించారు. సభలో మేయర్ సునీల్‌రావు, పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.