సింగరేణి ఆణిముత్యం సివిల్స్ సాధించింది. రామగుండం గనిలో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్న శ్రామికుడి బిడ్డ అయిదేళ్లు కష్టపడి అనుకున్నది సాధించింది. ‘నా లక్ష్యమే తన లక్ష్యంగా చేసుకుని నాన్న నా వెన్నంటి ఉన్నాడు. నా చదువు కోసం బొగ్గు బాయిలో రెక్కలు ముక్కలు చేసుకునే నాన్నలాగే నేనూ కష్టపడ్డాను’ అంటున్నది సివిల్స్ విజేత గుడెల్లి సృజన.
మాది పెద్దపల్లి జిల్లా పన్నూరు గ్రామం. నాన్న గుడెల్లి రాజేశం సింగరేణి కార్మికుడు. రామగుండం రీజియన్లోని ఓసీపీ-1లో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్నాడు. నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా మా ఊళ్లోనే జరిగింది. పదో తరగతి పూర్తయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఇంజినీరింగ్ చదవాలనే లక్ష్యంతో ఎంపీసీ తీసుకున్నాను. ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించాను. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజ్ (మంథని)లో బీటెక్ (కంప్యూటర్స్)లో చేరాను. బీటెక్ పూర్తయిన వెంటనే సివిల్స్ సాధనపై దృష్టి పెట్టాను.
నా చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలనే కోరిక ఉండేది. ఐఏఎస్ సాధించడం కోసం కష్టపడి చదివాను. నాన్న ఆదాయానికి సివిల్స్ కోచింగ్ ఖర్చు ఎక్కువే! అయినా కష్టం అనుకోకుండా నన్ను ఢిల్లీ పంపించాడు. ఏ లోటూ లేకుండా నా చదువుకు అయిదేళ్లు సహకరించాడు. అన్నయ్య రవితేజ మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. ఇప్పుడు సినీ రంగంలో పనిచేస్తున్నాడు. తమ్ముడు విష్ణుతేజ ఎన్ఐటీలో ఆర్కిటెక్చర్ చదివాడు. మా అమ్మ గృహిణి. నాన్న ఒక్కడి సంపాదనతోనే ఇల్లు గడిచేది. మా ముగ్గురినీ చదివించడం కోసం నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసేవాడు. కార్మిక కుటుంబం అయినా నన్ను చదివించడం కోసం నాన్న ఏనాడూ వెనుకడుగు వేయలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా నా లక్ష్యమే తన లక్ష్యంగా కష్టపడ్డాడు.
చదువుకునే రోజుల్లో నాన్న కష్టం ఎప్పుడూ నా మనసులో మెదులుతూ ఉండేది. తన కష్టానికి తగిల ఫలం ఇవ్వాలని అనుకునేదాన్ని. దాని కోసం అయిదేళ్లపాటు పట్టుదలతో చదివాను. ఈ క్రమంలో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షల్లో 35వ ర్యాంక్ సాధించాను. గతేడాది డీఎస్పీగా ఎంపికయ్యాను. ఈ శిక్షణలో ఉండగానే నా చిరకాల స్వప్నం నెరవేరింది. సివిల్ సర్వీస్ పరీక్షల్లో 55వ ర్యాంక్ వచ్చింది. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు.. ఈతి బాధలు తెలుసు. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని పేద ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తాను. మంచి అధికారిగా అందరి మన్ననలు అందుకున్నప్పుడే.. ఇన్నేళ్ల నా శ్రమకు సార్థకత చేకూరుతుంది.