కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 15 : కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను నమ్మి వారిని గెలిపిస్తే తెలంగాణలో ఇప్పుడు వస్తున్న 24 గంటల కరెంటు రాకుండా పోతుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 6, 7, 30వ డివిజన్లలో ప్రచారం చేయగా, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంత్రికి బోనాలు, డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదు నెలలకే చేతులు ఎత్తివేసిందని విమర్శించారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 32 భూ కేసులు ఉన్న వ్యక్తికి టికెట్ అమ్ముకున్నదని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రజల భూములు మిగలవని, ఎన్ని కేసులు నమోదవుతాయో ఆలోచించాలని అన్నారు. మరోవైపు నగరంలో తాము అభివృద్ధి చేస్తుంటే బీజేపీ మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు.
ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ నాలుగున్నరేండ్లలో ఏ రోజైనా కనిపించాడా? అని ప్రశ్నించారు. నగరాభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తీసుకువచ్చారా? అని నిలదీశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓటు వేద్దామా? అని ప్రశ్నించారు. దీనివల్ల నగరంలో అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందా? ఆలోచించాలని కోరారు. నగరంలో ప్రతి ఇంటికీ రోజూ మంచినీళ్లు సరఫరా అవుతున్నాయని, రాత్రిళ్లు వీధిదీపాల వెలుగుల్లో నగరం జిగేల్మంటుందని అన్నారు.
ఈ అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని ఆయన కోరారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి వారిని గెలిపిస్తే ఇప్పుడు వస్తున్న కరెంటు రాకుండా పోతుందని, మళ్లీ తాగునీటి కోసం తిప్పలు పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.