కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 21 : తెలంగాణలోని వనరులను మళ్లీ దోచుకునేందుకు విపక్ష నేతలు కుట్రలు పన్నుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గత 70 ఏండ్లలో కాంగ్రెస్, ఇతర పార్టీలు తెలంగాణను గుడ్డిదీపం చేశాయని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నదని అన్నారు. గతంలో దోచుకున్న నాయకులే పాదయాత్రల పేరుతో మళ్లీ వస్తున్నారని వీరిని నమ్మితే తెలంగాణ మరోసారి వెనుకబడి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్లో రూ.2.68 కోట్లతో చేపడుతున్న నాలుగు చౌరస్తాల సుందరీకరణ పనులకు మంత్రి మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నియోజకవర్గంలోని 370 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తున్నాయంటూ విపక్ష నాయకులు మాయమాటలు చెప్పేందుకు వస్తున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి బిడ్డ షర్మిలకు తెలంగాణలో ఏం పని? ఇకడ పాదయాత్రలు ఎందుకు చేస్తున్నదని ప్రశ్నించారు. వారి దొంగ మాటలు నమ్మొద్దని, నమ్మితే తెలంగాణ మరోసారి గుడ్డిదీపం అవుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇన్నాళ్లూ వారి పాలనను చూడలేదా? అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ మభ్యపెట్టే మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో ఎకడాలేని విధంగా కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.